ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!

20 Jan, 2017 08:23 IST|Sakshi
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ అక్కడినుంచి కదల్లేదు. మరోవైపు జల్లికట్టుకు మద్దతుగా ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. విద్యార్థులు మొదలుపెట్టిన ఈ నిరసన కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది.
 
లాయర్లు, నటులు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు వీటిలో పాల్గొంటున్నారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము ధిక్కరించలేమని, ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్సు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయడంతో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి. రెహ్మాన్ ఇప్పటికే తన నిరాహార దీక్ష విషయాన్ని ప్రస్తావించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన అభిమానులకు పిలుపునిస్తారని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కమల్‌హాసన్ కూడా వ్యక్తిగతంగా జల్లికట్టు ఉండాల్సిందేనని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. 
మరోవైపు ఆధ్యాత్మిక గురువులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ లాంటి వాళ్లు కూడా నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. జల్లికట్టు అనేది తమిళ సంస్కృతిలో భాగమని, అది సంక్రాంతి పండుగ సంబరాల్లో అంతర్భాగమని అన్నారు. జల్లికట్టుకు తాను మద్దతిస్తున్నానని, నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని రవిశంకర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాస్తవాలతో మరో తాజా అప్పీలు దాఖలు చేద్దామన్నారు. జంతువులకు పండుగను అంకితం చేసే ఉత్సవం లాంటిదే జల్లికట్టు అని, ప్రజల సాంస్కృతిక బలాన్ని తీసేసుకుంటామంటే కుదరదని, ముఖ్యంగా పల్లెల్లో ఇవి చాలా ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ అన్నారు. 
దారిలోనే ఉంది.. రెడీగా ఉండండి
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జల్లికట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'బిగ్ డే' దారిలోనే ఉందని అందులో చెప్పారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే, జల్లికట్టు మంచి సంప్రదాయమే అయినా అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దాని గురించి ఏమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. మరి పన్నీర్‌కు ఏరకమైన సూచన వచ్చిందో, జల్లికట్టు గురించి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాల్సి ఉంది.