అది కూడా తెలియదా?: నెటిజన్ల ఫైర్‌

2 Jun, 2017 12:27 IST|Sakshi
అది కూడా తెలియదా?: నెటిజన్ల ఫైర్‌

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: దేశాధినేతలను ఇంటర్వ్యూ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా కసరత్తు చేస్తుంటారు. కానీ ఎటువంటి కసరత్తు చేయకుండా నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఎన్‌బీసీ) మహిళా జర్నలిస్ట్‌ మెగన్‌ కెల్లీ విమర్శలపాలయ్యారు. కనీస అవగాహన లేకుండా వేసిన ప్రశ్నతో ఆమె నవ్వులపాలయ్యారు.

రష్యా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో పాటు కెల్లీ ఇంటర్వ్యూ చేశారు. దీనికి ముందు కొన్‌స్టాన్‌టిన్‌ ప్యాలెస్‌లోకి పుతిన్‌తో కలిసి ప్రవేశించిన మోదీకి కెల్లీ ఆహ్వానం పలికారు. మోదీతో కరచాలనం చేశారు. దీనికి స్పందనగా.. ‘ మీ ట్వీట్‌ చూశాను.. గొడుగు పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశార’ని మోదీ చెప్పడంతో కెల్లీ ఆశ్చర్యపోయారు. ‘నిజంగానా! మీరు ట్విటర్‌లో ఉన్నారా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మోదీ ఒకింత ఆశ్చర్యానికి గురైనా అదేమి కనిపించకుండా సమాధానంగా చిరునవ్వు నవ్వారు.

ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుల్లో మోదీ మూడో వ్యక్తి అన్న సంగతి తెలియకుండా ప్రశ్న వేసిన కెల్లీపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీస అవగాహన లేకుండా దేశాధినేతలను ఇంటర్వ్యూ చేయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. కెల్లీ కంటే 10 రెట్లు ఎక్కువ ఫాలోవర్లు మోదీని ఉన్నారని తెలుపుతూ ఫొటోలు పోస్ట్‌ చేశారు. కెల్లీ ఎటువంటి కసరత్తు చేయకుండానే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారని విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు