పట్టపగలే రూ.7 కోట్ల దోపిడీ

29 Jan, 2014 05:21 IST|Sakshi
పట్టపగలే రూ.7 కోట్ల దోపిడీ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నేరగాళ్లు పట్టపగలే స్వేచ్ఛగా విహారం చేస్తూ తమ పనులు చేసుకుపోతున్నారు. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అత్యాచార కేసులతో ప్రతిష్ట మసకబారిన ఢిల్లీ నగరంలో మంగళవారం భారీ దోపిడీ ఒకటి జరిగింది. ఆయుధాలతో వచ్చిన సుమారు ఆరుగురు దుండగులు స్థిరాస్తి వ్యాపారి కారును అడ్డగించి, ఆయన సిబ్బంది నుంచి  ఏడున్నర కోట్లు దోచుకుని పరారయ్యారు. పక్కా పథకం ప్రకారం.. సినీఫక్కీలో నేరగాళ్లు తమ పనిచేసుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు..
 
-     మంగళవారం ఉదయం.. కల్జాజీ ప్రాంతవాసి అయిన స్థిరాస్తి వ్యాపారి రాహుల్ అహుజా వద్ద మేనేజర్‌గా పనిచేస్తున్న రాకేశ్‌కల్రా తన ఆఫీసు నుంచి 7.69 కోట్ల నగదును తీసుకుని కరోల్‌బాగ్‌లోని ఒక బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయడానికి కారులో వెళుతున్నారు. ఆయన వెంట డ్రైవర్, ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు.
 
 -    ఉదయం 9 గంటలు. హోండాసిటీ కారు కరోల్‌బాగ్ వైపు వెళుతూ లజ్‌పత్‌నగర్ మెట్రోస్టేషన్ సమీపానికి వచ్చింది.
-     ఇంతలో వెండిరంగులో ఉన్న వ్యాగన్-ఆర్ కారు(యూపీ రిజిస్ట్రేషన్ నంబర్).. హోండా సిటీ కారును దాటుకుని ఒక్కసారిగా అడ్డంగా ఆగిపోయింది. హోండా సిటీ కారు డ్రైవర్ బ్రేక్ వేసేలోపే ముందున్న వ్యాగన్ ఆర్‌ను ఢీకొట్టింది. దాంతో వ్యాగన్ ఆర్ డ్రైవర్, అందులోని మరొకరు కిందికి దిగి.. కల్రా, అతడి సహచరులతో వాదనకు దిగారు. వారి మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
 -    తెల్ల రంగు హోండా వెర్నా కారు(హర్యానా రిజస్ట్రేషన్ నంబర్) వచ్చి కల్రా కారు వెనుకనే ఆగింది. అందులోంచి ముగ్గురు లేదా నలుగురు దుండగులు కిందికి దిగారు. కల్రా కారు వద్దకు వచ్చి కిందికి రావాలని తుపాకులతో బెదిరించారు. వారు బయటకు వచ్చిన వెంటనే.. అందులో ఉన్న రూ. 7.69 కోట్ల నగదు బ్యాగులతో అదే కారులో దుండగులు ఉడాయించారు. మిగతా దుండగులు వెర్నా కారులో పారిపోయారు.
-     ఉదయం రద్దీ సమయంలో 20 నిమిషాలకుపైగా ఈ దోపిడీ తతంగం సాగింది.
 -    9.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించగా  ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.
-     దుండగులు వదిలేసిన వ్యాగన్ ఆర్ కారు ఈ నెల 24న ముకర్బా చౌక్ నుంచి చోరీ అయినట్లు తేలింది. అలాగే, సంఘటనా ప్రదేశానికి కిలోమీటరు దూరంలో జుంగ్‌పురా వద్ద వెర్నా కారును దుండగులు వదిలేసి వెళ్లారు.
-     హోండా సిటీ కారును బారాపులా ఫ్లైఓవర్ వద్ద గుర్తించారు. అందులో రెండు ఖాళీ సంచులు మాత్రమే లభించాయి. భారీ దోపిడీ కావడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
 -    పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, నగదు తీసుకెళుతున్న విషయం ఎవరికి తెలిసి ఉంటుంది? అన్న కోణంలోనూ వ్యాపారి కల్రాను విచారిస్తున్నారు.
-     ఫోరెన్సిక్ నిపుణులు దుండగులు ఉపయోగించిన కార్ల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగిలించిన కార్లను వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు.
-     లజ్‌పతి నగర్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

>
మరిన్ని వార్తలు