‘ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి’

13 Jun, 2017 09:38 IST|Sakshi
‘ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి’

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ’వీధి గుండా’లా వ్యవహరిస్తున్నాంటూ కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో దీనిపై సీపీఎం నేత బృందా కారత్‌ స్పందించారు. సోమవారం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సందీప్‌ దీక్షిత్‌ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయితే ఒక నిర్దిష్ట సందర్భాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పడంతో ఆ వ్యవహారం ముగిసిపోయిందని అన్నారు. అయితే బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటం వల్లే వివాదం చెలరేగిందన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన తగ్గించినట్టయిందని, మన సైన్యానికి సంబంధించిన అంశాల విషయంలో ఆయన సంయమనంతో వ్యవహరించాల్సి ఉందని బృందాకారత్‌ అభిప్రాయపడ్డారు.

బిపిన్‌ రావత్‌ రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ, పాకిస్థాన్‌తో పాటు దేశంలోని ఉగ్రవాదులు, తీవ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న అర్ధంలో రెండున్నర యుద్ధాలకు (టూ అండ్‌ ఆఫ్‌ వార్‌ ఫ్రంట్‌)కు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దీనిపై సందీప్‌ దీక్షిత్‌ స్పందిస్తూ, రావత్‌ వ్యాఖ్యలు ఓ వీధి గూండాను తలపిస్తున్నాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో సందీప్‌ దీక్షిత్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పారు.

అయినప్పటికీ ఈ దుమారం తగ్గలేదు. పేరున్న ఓ కాంగ్రెస్‌ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. దీంతో సందీప్‌ దీక్షిత్‌ మరోసారి క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి అనాగరిక భాష ఉపయోగించలేదని, బిపిన్‌ రావత్‌ మరోలా మాట్లాడాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు