నిన్న పురస్కారం... నేడు వీర మరణం

28 Jan, 2015 03:48 IST|Sakshi
నిన్న పురస్కారం... నేడు వీర మరణం

 శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో గణతంత్ర దినోత్సవంలో శౌర్య పతకం అందుకున్న ఓ ఆర్మీ అధికారి సహా ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. మరో సైనికుడు గాయపడ్డారు. శ్రీనగర్‌కు 36 కి.మీ దూరంలోని మిండోరా గ్రామంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు స్థానిక మిలిటెంట్లు హతమైనట్లు సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హిజ్బుల్ మిలిటెంట్ ఒకరు సహచరుడితో కలిసి ఇంటికి వచ్చాడనే విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీసులు ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ సహకారంతో గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం యుధ్ సేవా మెడల్ అందుకున్న 42 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్‌ఆర్) కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎం.ఎం.రాయ్, మరో పోలీసు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ రాయ్ స్వస్థలం. 9 గోర్ఖా రైఫిల్స్‌కు చెందిన ఆయన డెప్యుటేషన్‌పై ఆర్‌ఆర్‌లో పనిచేస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లో గత ఏడాది మిలిటెంట్లతో జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను కల్నల్ రాయ్‌కు ఈ మెడల్ లభించింది.

 

మరిన్ని వార్తలు