27లోపు హాజరుకాకుంటే అరెస్టు చేస్తాం!

23 Jun, 2016 18:21 IST|Sakshi
27లోపు హాజరుకాకుంటే అరెస్టు చేస్తాం!

- సరితా నాయర్ కు విచారణ కమిషన్ హెచ్చరిక

కొచ్చి: కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కు వ్యతిరేకంగా దర్యాప్తు కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఎన్నిసార్లు పిలిచినా తమ ముందు విచారణకు హాజరుకాకపోవడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 27న ఆమె కమిషన్ ముందు హాజరుకావాలని, లేకపోతే ఆమెను అరెస్టు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ తేల్చిచెప్పింది. సరితా నాయర్ గతంలో నాలుగుసార్లు కమిషన్ ముందు విచారణకు హాజరుకాలేదు. కమిషన్ ముందుకు రాకపోవడానికి ఆమె గుర్తుతెలియని కారణాలను చెప్తున్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తామని అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసి.. ఆ తర్వాత మోసం చేసిన కేసులో 2013లో సరితా నాయర్‌ను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

సోలార్ కుంభకోణంలో భాగంగా తాను అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ, ఆయన కేబినెట్ మంత్రి అరయాదన్ మహమ్మద్ కు రూ. 1.9 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ శివరాజన్ కమిషన్ ఏర్పాటైంది. కాగా, తనపై ఆరోపణలు చేసినందుకుగాను సరితా నాయర్ పై మాజీ సీఎం చాందీ పరువు నష్టం దావా వేశారు.

మరిన్ని వార్తలు