'ఆర్ట్ ఆఫ్ లివింగ్'కు ఐఎస్ బెదిరింపు

28 Mar, 2015 19:11 IST|Sakshi

పైశాచిక చర్యలతో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దృష్టి ఇప్పుడు ధ్యాన కేంద్రాలపై పడింది. ప్రముఖ గురువు పండిట్ రవిశంకర్ సారధ్యంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ మలేషియా చాప్టర్కు ఐఎస్ ఉగ్రవాదులు శనివారం బెదిరింపు లేఖఖలు రాశారు. కార్యకలాపాలు నిలిపివేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరింస్తూ మూడు లేఖలు రాశారు. దీంతో రవిశంకర్ శిశ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉగ్రవాదులు బెదిరింపు లేఖలు పంపిన మలేషియా శాఖలో ప్రతిరోజు ఉదయం 10 వేల మందికి పైగా యోగా తరగతులకు హాజరవుతారు. త్వరలోనే సుమారు 70 వేల మంది ప్రజలు పాల్గొనే సభలో పండిట్ రవిశంకర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భద్రత తమకు ప్రధానాంశమని, లేఖలు ఎవరు పంపారు, ఎలా పంపారనే విషయాల్ని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

భారత్తోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో వందలకొద్దీ శాఖలున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ.. శాంతియుత జీవన సాధనా ప్రక్రియతోపాటు యోగాలోనూ శిక్షణనిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్.. రెండు రోజుల కిందటే కాంబోడియాలో మరో శాఖను ప్రారంభించారు.

మరిన్ని వార్తలు