ఆర్టికల్‌ 35ఏ.. మరో తేనెతుట్టె!

17 Aug, 2017 01:19 IST|Sakshi
ఆర్టికల్‌ 35ఏ.. మరో తేనెతుట్టె!

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌–370 అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే అధికరణం– 35ఏ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో విచారించనుంది. జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా ఆర్టికల్‌–35ఏకు అనుకూలంగా మాట్లాడుతుండగా కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై చర్చకు తెరతీస్తే అది తేనెతుట్టెను కదిపినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏమిటీ అధికరణం 35ఏ?
జమ్మూ కశ్మీర్‌లో ‘శాశ్వత నివాసులు’ అన్న పదాన్ని నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్‌ 35ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసులను నిర్ధారించింది. దాని ప్రకారం 1911కు ముందు జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు వచ్చిన వారెవరూ అక్కడ స్థిరాస్తులు కొనకూడదు.

ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకార వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అలాగే శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయి. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయంలో ఇది వర్తించదు. అయితే 2002 అక్టోబరులో జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో పిటిషన్‌...
ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35ఏను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన ‘వి ద సిటిజన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. అలాగే ఆర్టికల్‌ 35ఏ తమ పిల్లలకు ఓటు హక్కు లేకుండా చేస్తోందని ఇద్దరు కశ్మీరీ మహిళలు గత నెలలో సుప్రీంను ఆశ్రయించారు.

ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై కోర్టులో అఫిడవిట్‌ వేయ కుండా, ఈ అంశంపై విస్తృతచర్చ జరగడంతోపాటు దీనిని రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలని కోరుకోవడం మరింత వేడి పుట్టిస్తోంది. ఆర్టికల్‌ 35ఏపై చర్చ అంటే దాదాపుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370పై చర్చగానే భావించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హక్కు లను ప్రశ్నించకుండా అధికరణం 35ఏ చెల్లుబాటును, రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని చరిత్రకారుడు శ్రీనాథ్‌ రాఘవన్‌ అంటున్నారు.     
 –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు