కొత్త రక్షణ మంత్రి ఎవరో తెలుసా?

13 Mar, 2017 15:20 IST|Sakshi
కొత్త రక్షణ మంత్రి ఎవరో తెలుసా?

రక్షణ శాఖ మంత్రిత్వ పదవికి మనోహర్ పారికర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రక్షణ శాఖ బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అరుణ్ జైట్లీయే రక్షణ మంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత తనకు పనిభారం ఎక్కువైందని, ఏదో ఒక శాఖ తీసేయాలని జైట్లీ కోరడంతో.. పారికర్‌ను గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ తీసుకొచ్చారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఒక్క మనోహర్ పారికర్‌ను తప్ప వేరెవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టినా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ లాంటివి గతంలోనే లక్ష్మీకాంత్ పర్సేకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ పార్టీ కూడా మనోహర్ పారికర్ సీఎంగా వస్తామంటే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపింది.

దాంతో.. ఏరికోరి రక్షణ శాఖకు తీసుకున్న పారికర్‌ను మళ్లీ సొంత రాష్ట్రానికి ప్రధాని పంపేశారు. చాలాకాలంగా గోవా ఆహారం తినకపోవడంతో తాను సన్నబడ్డానని ఎన్నికల ప్రచారం సమయంలో పారికర్ వ్యాఖ్యానించారు. దానికి అర్థం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చని కూడా ఆయన మీడియాతో అన్నారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు మళ్లీ సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్లిపోతున్నారు. కాగా, పారికర్‌ను అసెంబ్లీకి పంపేందుకు వీలుగా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా రాజీనామా చేశారు. ఆయన ఎన్నికైన మాపుసా స్థానం నుంచే పారికర్ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. డిసౌజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఢిల్లీకి పంపుతారని అంటున్నారు.

మరిన్ని వార్తలు