అరుణ్ జైట్లీకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు!

12 Aug, 2014 10:46 IST|Sakshi
అరుణ్ జైట్లీకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు!

న్యూఢిల్లీః సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ వృద్ధనేత కరణ్ సింగ్, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు శరద్ యాదవ్‌లు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు అందుకోనున్నారు. నేడు(మంగళవారం) ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. 2010లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు నిర్వర్తించినందుకు గుర్తింపుగా జైట్లీని ఈ అవార్డుకు ఎంపికచేశారు. 2011వ సంవత్సరానికి కరణ్ సింగ్‌ను, 2012వ సంవత్సరానికి శరద్ యాదవ్‌ను ఈ అవార్డును అందించనున్నారు. వీరు ముగ్గురు ఉత్తమపార్లమెంటేరియన్ అవార్డులకు ఎంపికైనట్టు గత ఏడాది మార్చిలోనే ప్రకటించారు.

 

ఈ అవార్డుల ప్రదానం కార్యక్రమానికి, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు హాజరవుతారు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1994లో ఈ అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు