రాహుల్ వ్యాఖ్యలపై దుమారం

29 Jan, 2014 03:00 IST|Sakshi
రాహుల్ వ్యాఖ్యలపై దుమారం

న్యూఢిల్లీ/పాట్నా: గుజరాత్‌లో 2002 నాటి అల్లర్లకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీదే బాధ్యత అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. గుజరాత్ అల్లర్లను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించిందని, పోలీసుల కాల్పుల్లో అల్లర్లకు పాల్పడ్డ 190 మంది మరణించారని గుర్తు చేసింది. ఇందుకు భిన్నంగా ఢిల్లీలో 1984లో అల్లర్లు జరిగినప్పుడు అల్లరి మూకలపై ఒక్క తూటానైనా కాల్చలేదని విమర్శించింది. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని మంగళవారం బీజేపీ నేత రవిశంర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించిన దర్యాప్తు మోడీకి క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత కూడా రాహుల్ ఆయనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.
 
 గుజరాత్ అల్లర్లపై రాహుల్ వద్ద తగిన సమాచారం లేదని, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమైనవని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కులపై దాడులకు దిగిన అల్లరి మూకలకు కాంగ్రెస్ నేతలే నాయకత్వం వహించారని ఆయన అన్నారు. నాటి అల్లర్లపై దర్యాప్తు కమిషన్‌కు ఆధిపత్యం వహించిన జడ్జిని కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు పంపడంతో బాధితులకు నేటికీ న్యాయం దక్కలేదని ఆరోపించారు. సిక్కులకు వ్యతిరేకంగా 1984లో ప్రభుత్వ ప్రోద్బలంతోనే అల్లర్లు జరిగాయని, అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.
 
 రాహుల్‌పై అకాలీ, నితీశ్ విమర్శలు...
 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై శిరోమణి అకాలీదళ్ నేతలు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం తీవ్ర విమర్శలు కురిపించారు. రాహుల్‌పై వారి విమర్శలు...
     గుజరాత్ అల్లర్లకు ముఖ్యమంత్రి మోడీ బాధ్యుడని రాహుల్ చెబుతున్నారని, మరి 1984లో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు ప్రధానిగా ఉన్న తన తండ్రి రాజీవ్ గాంధీ సంగతేమిటని అకాలీదళ్ నాయకుడు నరేశ్ గుజ్రాల్ ప్రశ్నించారు.
     అప్పట్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు తన తండ్రి, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సహా పలువురు అల్లర్లను అరికట్టాలంటూ అప్పటి రాష్ట్రపతిని,  హోంమంత్రిని పదేపదే కోరినా వారు నిస్సహాయత వ్యక్తం చేశారని నరేశ్ గుజ్రాల్ అన్నారు.
     సిక్కులంతా కాంగ్రెస్‌ను బహిష్కరించాలని పంజాబ్ డిప్యూటీ సీఎం బాదల్ అన్నారు.
     సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి రాహుల్ మాటలపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
     సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్లకు, 1989లో భాగల్పూర్‌లో జరిగిన అల్లర్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలదే బాధ్యత అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు.
 రాహుల్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్...
 కాంగ్రెస్ రాహుల్‌ను వెనకేసుకొచ్చింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులపై దోషనిర్ధారణ జరిగిందని, అయితే  ‘గోద్రా’ తర్వాతి అల్లర్ల కేసులను మాత్రం న్యాయం కోసం గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.

>
మరిన్ని వార్తలు