కేంద్ర హోం శాఖ ఎదుట కేజ్రీవాల్, మంత్రుల ధర్నా!

17 Jan, 2014 20:52 IST|Sakshi
కేంద్ర హోం శాఖ ఎదుట కేజ్రీవాల్, మంత్రుల ధర్నా!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గంలోని మొత్తం మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఎదుట సోమవారం నాడు ధర్నా చేయనున్నారు. చిన్న చిన్న విషయాల కోసం ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులతో గొడవపడ్డ పోలీసులపై చర్య తీసుకోని పక్షంలో ఈ ధర్నా తప్పదని ఇప్పటికే ప్రకటించారు. పోలీసు అధికారులపై చర్య తీసుకోని పక్షంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి ధర్నా చేయనున్నట్లు మంత్రి మనీష్ సిసోదియా తెలిపారు.

దక్షిణ ఢిల్లీలో జరుగుతున్న వ్యభిచార రాకెట్పై చర్య తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి కోరగా, ఇద్దరు పోలీసు అధికారులు అందుకు నిరాకరించారని, పైగా ఆయనతో గొడవపడ్డారని, వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను స్వయంగా కేజ్రీవాల్ కోరినా ఆయన పట్టించుకోలేదని సిసోదియా చెప్పారు. అలాగే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లాతో కూడా మరో పోలీసు అధికారి గొడవపడ్డారని చెప్పారు. డేనిష్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును ఢిల్లీ పోలీసులు సరిగా ఛేదించలేదని కూడా కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాలవీయ నగర్ ఎస్హెచ్ఓతో పాటు ఇద్దరు ఏసీపీలను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ స్వయంగా షిండేను డిమాండ్ చేశారు. అలాగే బిర్లాతో గొడవపడిన అధికారిని కూడా సస్పెండ్ చేయాలన్నారు. ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ధర్నా చేయాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు