సీఎం తీరుపై ఈసీ మండిపాటు

21 Jan, 2017 17:00 IST|Sakshi
సీఎం తీరుపై ఈసీ మండిపాటు

న్యూఢిల్లీ: ‘ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం మా పార్టీకే వెయ్యండి’ అని ఓటర్లకు సలహా ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతిని ప్రోత్సహించేలా మాట్లాడటమేకాక, వివరణ ఇవ్వాలన్న నోటీసులకు సైతం స్పందించకుండా కేజ్రీవాల్‌ ధిక్కారస్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించింది. ఇకముందు కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తే పార్టీ గుర్తింపు రద్దు సహా ఎలాంటి చర్యకైనా వెనుకాడేదిలేదని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

జనవరి 8న గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ’కాంగ్రెస్‌, బీజేపీలు డబ్బులిస్తే తీసుకోండి. ఓటు మాత్రం ఆప్‌కే వేయండి’అని అన్నారు. కేజ్రీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదుచేసింది. పరిశీలన అనంతరం జనవరి 19న తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ.. కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కాగా, ఎన్నికల కమిషన్ ఉత్వర్వుపై కేజ్రీవాల్ స్పందిస్తూ. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. 'నాపై ఈసీ ఇచ్చిన ఉత్వర్పులు పూర్తిగా తప్పు. కింద కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈసీ ఉత్వర్వును కోర్టు పట్టించుకోలేదు. ఈసీ ఇచ్చిన తాజా తీర్పును కోర్టులో సవాలు చేస్తాం' అని కేజ్రీవాల్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు