రిపోర్టర్ పై విరుచుకుపడిన ముఖ్యమంత్రి

19 Nov, 2016 17:11 IST|Sakshi
రిపోర్టర్ పై విరుచుకుపడిన ముఖ్యమంత్రి
పెద్దనోట్ల రద్దుపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీసీ హిందీ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 55 మంది మరణించడానికి కారణం నోట్ల రద్దేనని ఎలా చెబుతారని బీబీసీ రిపోర్టర్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఢిల్లీ సీఎం..  మీడియాలో మీలాంటి ఉద్యోగులందరూ ధైర్యం ఉంటే ఈ ప్రశ్నను డబ్బుకోసం ఏటీఎంల ముందు బారులు తీరుతున్న జనాన్ని అడగాలని సమాధానమిచ్చారు.
 
అందుకు స్పందించిన బీబీసీ రిపోర్టర్. ఆ ప్రశ్నను సంధించడం తన వృత్తిధర్మమని అన్నారు. ఓ రిపోర్టర్ గా తప్పు, ఒప్పులను విడిగొట్టడం తన బాధ్యత అని చెప్పారు. పెద్ద నోట్ల అనంతరం సంభవించిన మరణాలన్నీ దానివల్లే జరిగాయనడం సమజసం కాదని అన్నారు. రిపోర్టర్ ఇచ్చిన సమాధానంపై టీవీ కెమెరా వైపు చూస్తూ మాట్లాడిన కేజ్రీవాల్.. బీబీసీ ఎంత నిజాయితీ కలిగిన మీడియా సంస్ధో గుర్తించాలన్నారు. అదే సమయంలో రిపోర్టర్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. పెద్దస్వరంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో గుర్తించాలని తెలిపారు.  
 
పెద్దనోట్ల రద్దే  మరణాలకు కారణమని రిపోర్టర్లు చెప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేజ్రీవాల్ బదులు ఆయన డ్రైవర్ డబ్బును డ్రా చేశారని రిపోర్టర్ చెప్పగా..  అంతమాత్రాన ఆ 55 మంది మరణానికి పెద్దనోట్ల రద్దు కారణం కాదంటారా అని ప్రశ్నించారు. దేశంలో సంపన్నులెవరూ నోట్లరద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పారు. దీనికి ప్రతిగా స్పందించిన రిపోర్టర్ అది మీ సొంత వ్యాఖ్యేనని అనడంతో ఉద్రేకంతో ఊగిపోయిన కేజ్రీవాల్..  జర్నలిస్టులు దీన్ని పనికిమాలిన సమస్యగా మార్చాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. 
 
ఆపై రిపోర్టర్ ను చూస్తూ మాట్లాడిన కేజ్రీవాల్.. ఇంటర్వ్యూ చేయాలంటే సరిగా చేయాలన్నారు. అందుకు ప్రతిగా ప్రశ్నలకు స్పందించకుండా నిందించడం సబబు కాదని రిపోర్టర్ అన్నారు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు