జనం నెత్తిన కేజ్రీవాల్ లీగల్ బిల్లు.. 3.42 కోట్ల భారం!

4 Apr, 2017 08:14 IST|Sakshi
జనం నెత్తిన కేజ్రీవాల్ లీగల్ బిల్లు.. 3.42 కోట్ల భారం!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. తన తరఫున ఆ కేసు వాదించడానికి రాం జెఠ్మలానీని కేజ్రీవాల్ నియమించుకున్నారు. జెఠ్మలానీ అంటే ఆషామాషీ లాయర్ కారు. సుప్రీంకోర్టు జడ్జీలు సైతం ఆయన దగ్గర కాస్త గౌరవంగా ఉంటారు. కేజ్రీవాల్ తరఫున వాదించినందుకు ఆయన వేసిన బిల్లు అక్షరాలా రూ. 3.42 కోట్లు. ఆ డబ్బులను వ్యక్తిగతంగా చెల్లించాల్సింది పోయి.. దాన్నంతటినీ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని కేజ్రీవాల్ చూస్తున్నారు. అంటే.. ఆ భారం మొత్తం ప్రజలు భరించాల్సిందేనన్న మాట. ప్రజలు పన్నులు కట్టగా వచ్చిన ఆదాయం నుంచి కేజ్రీవాల్ తన సొంత న్యాయ ఖర్చులను చెల్లిస్తున్నారన్న మాట. కేజ్రీవాల్ తరఫున వాదించేందుకు వకాల్తా పుచ్చుకున్నందుకు 2016 డిసెంబర్ ఒకటో తేదీన జెఠ్మలానీ కోటి రూపాయల బిల్లు వేశారు. ఆ తర్వాత కోర్టుకు హాజరైనందుకు ఒక్కోసారి రూ. 22 లక్షలు బిల్లు వేశారు. ఆయన మొత్తం 11 సార్లు కోర్టుకు రావడంతో మొత్తం బిల్లు రూ. 3.42 కోట్లయింది. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం మీద సీబీఐ దాడులకు ఈ కేసుకు సంబంధం ఉంది కాబట్టి ఈ బిల్లును ప్రభుత్వం క్లియర్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సంబంధిత ఫైలు మీద రాశారు. ఇలాంటి దాడుల మీద ప్రభుత్వ విధానాన్ని మీడియాకు వివరిస్తూ ముఖ్యమంత్రి కొన్ని ప్రకటనలు చేశారని, వాటిమీదే పరువు నష్టం దావాలు నమోదయ్యాయని అందువల్ల ఇదంతా అధికారికమే అవుతుందని చెప్పారు.

ఆ తర్వాత ఈ ఫైలు ఢిల్లీ ప్రభుత్వ న్యాయశాఖలోని లిటిగేషన్ బ్రాంచికి వెళ్లింది. అయితే, దీనికి చెల్లింపులు చేసేందుకు న్యాయశాఖ మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనికి ఆర్థికశాఖ నుంచి, ఇంకా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అనుమతులు అవసరమని చెప్పింది. అయితే ఫైలును లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపాల్సిన అవసరం లేదని, దానికిబదులు సంబంధిత పాలనా శాఖకు, జీఏడీకి పంపితే సరిపోతుందని మనీష్ సిసోదియా అన్నారు. చివరకు ముఖ్యమంత్రి ఆమోదంతో వెంటనే ఫైలును ఆమోదించేశారు. కానీ.. వాస్తవానికి ఈ కేసులో అరుణ్ జైట్లీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య వ్యక్తిగతంగా న్యాయపోరాటం జరిగింది. ఒకవేళ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలోనే కేసుకు హాజరు కావాలనుకుంటే అప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 80ని అమలుచేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇదేమీ చేయకుండా నేరుగా ప్రజాధనాన్ని తన సొంత వ్యవహారాల కోసం ఖర్చుపెట్టేస్తున్న ఘనత అరవింద్ కేజ్రీవాల్‌కే దక్కింది.

మరిన్ని వార్తలు