దత్తన్నను వరించనున్న మంత్రి పదవి!

28 May, 2014 12:15 IST|Sakshi
దత్తన్నను వరించనున్న మంత్రి పదవి!

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి కేటాయించే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నారని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. బండారు దత్తాత్రేయతోపాటు తెలంగాణలోని టీడీపీ ఎంపీలందరికి మంచి రోజులు వస్తాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జవదేకర్ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరికి మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువత్తాయి. ఈ నేపథ్యంలో విలేకర్లు ఆ విషయాన్ని జవదేకర్ను ప్రశ్నించారు. దాంతో ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు.

సికింద్రాబాద్ లోక్సభకు ఎన్నికైన బండారు దత్తాత్రేయ... గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో  మోడీ కేబినెట్లో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆయనకి మోడీ కేబినెట్లో చోటు దక్కలేదు. దాంతో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా మోడీ మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై తెలంగాణ ప్రజలల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

మోడీ సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా మోడీ కేబినెట్లో 45 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో విజయనగరం లోక్సభ సభ్యుడు పి.అశోక్ గజపతి రాజుకు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి కేటాయించారు. అయితే ఆయన కర్ణాటక రాష్టం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు