సత్య నాదెళ్ల నందన్ నిలేకనిని అడిగిన ప్రశ్నిదే!

21 Feb, 2017 09:26 IST|Sakshi
సత్య నాదెళ్ల నందన్ నిలేకనిని అడిగిన ప్రశ్నిదే!
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనాదెళ్ల, ఆధార్ ప్రాజెక్ట్ మూలస్తంభంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని ఒకే వేదికపై ఆసీనులయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్లో టెక్ టైటాన్స్ ఇద్దరూ ఒకరినొకరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల, నందన్ నిలేకనిని ఓ ప్రశ్న అడిగారు. ఆధార్ ప్లాట్ఫామ్ను కొనియాడిన నాదెళ్ల, టెక్నాలజీ పరంగా ఆధార్పై తమకున్న విజన్, దాని ప్రభావం ఏమిటి అని నందన్ నిలేకనికి అడిగారు.  తాము డిజైన్ చేస్తున్నప్పుడు ఆధార్ ప్లాట్ ఫామ్కు  ఓ వేగం, స్థాయి ఉంది. ఆ వేగం, స్థాయి ఉంటేతప్ప నిజంగా అనుకున్న దాన్ని తాము సాధించలేమని నిలేకని చెప్పారు. ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపరచుకునేందుకు ఉపయోగపడే డిజిలాకర్‌కు ఆధార్‌ ఉపయుక్తమవుతుందని చెప్పారు.
 
దేశంలో వ్యక్తిగత డిజిటల్‌ చెల్లింపులు 5 శాతమే ఉన్నాయని, వచ్చే ఏడాదికి 15-20 శాతానికి చేరుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశారు. కార్డు లావాదేవీల కంటే ఆధార్‌, వేలిముద్ర ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు అధికమవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తాము ప్రారంభించిన ఆధార్కు ఇరు ప్రభుత్వాలు మద్దతు పలకడం చాలా అదృష్టమని సంతోషం వ్యక్తంచేశారు. ఆధార్ ప్రొగ్రామ్ను ప్రారంభించిన ఐదున్నరేళ్లలో బిలియన్ యూజర్లను(100 కోట్ల యూజర్లను) ఛేదించింది. గత 2-3ఏళ్లలోనే ఆధార్కు అనూహ్య స్పందన వస్తుందని నందన్ నిలేకని చెప్పారు. ఆధార్ ఆధారిత కేవైసీ వాడుతూ రిలయన్స్ జియో కూడా చాలా తక్కువ సమయంలోనే విజయవంతంగా తన సబ్ స్క్రైబర్ బేస్ను సాధించిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆధార్కు మరింత డిమాండ్ పెరిగింది. నందన్ నిలేకని ఆధార్ ప్రొగ్రామ్కు మాజీ చైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి అడ్వయిజరీగా ఉన్నారు.  
మరిన్ని వార్తలు