హవ్వ.. ఆసారాం మహాత్ముడట!

2 Aug, 2015 15:15 IST|Sakshi
హవ్వ.. ఆసారాం మహాత్ముడట!

జోధ్పూర్: 'పిల్లలూ ఈ రోజు పాఠంలో మనదేశంలో మహనీయులుగా వెలుగొందిన మహాత్ముల పేర్లు చెప్పుకుందాం. శంకరాచార్య, మదర్ థెరిసా, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గురునానక్, సంత్ కబీర్.. ఆసారం బాపు.. రామ్ దేవ్ బాబా..' అప్పటి వరకూ టీచర్ చెబుతున్న పేర్లను వల్లెవేస్తూ వచ్చిన పిల్లలందరూ చివరి రెండు పేర్ల దగ్గర మాత్రం ఠక్కున  ఆగిపోయారు!

తమ లాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్రయత్నంచేసి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం మహాత్ముడు ఎలా అవుతాడో ఆ చిన్ని బుర్రలు ఆలోచించడం మొదలుపెట్టాయి. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. వాటిని ముద్రించిన పబ్లిషర్లకు మాత్రం ఆ సందేహం ఇసుమంతైనా కలగలేదు. ప్రస్తుతం రాజస్థాన్ లోకి కొన్ని జిల్లాల పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితి ఇది!

16 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై అరెస్టయిన ఆసారం బాబును మహాత్ముడిగా అభివర్ణిస్తూ.. ఆయన చిత్రపటాన్ని గుర్తించాల్సిందిగా మూడో తరగతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహోన్నతుల సరసన అత్యాచారం కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి పాఠ్యాంశం ఒకటుందని తమకు ఇంకా తెలియరాలేదని విద్యాశాఖ అధికారు చెబుతున్నారు.

ఇటు పబ్లిషర్ వివరణ మరోలా ఉంది. 'ఆసారంను పాఠ్యాంశంలో చేర్చేనాటికి ఆయనపై ఎలాంటి కేసులు లేవు. పుస్తకం ప్రింట్ అయి.. విద్యార్థులకు చేరిన తర్వాతే ఆయన అరెస్టయ్యాయి. వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తెప్పించి.. కొత్త వాటిని ముద్రించేపనిలో ఉన్నాం' అని చెప్పాడు పబ్లిషర్. భావిభారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వేచిచూడాలి.

మరిన్ని వార్తలు