అఫ్ఘాన్ ప్యాలెస్‌లో ఆతిథ్యమిస్తాం

30 Apr, 2015 01:23 IST|Sakshi
అఫ్ఘాన్ ప్యాలెస్‌లో ఆతిథ్యమిస్తాం

భారత ఇన్వెస్టర్లకు అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు ఘని ఆహ్వానం
న్యూఢిల్లీ :  అఫ్ఘానిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టదల్చుకునే భారతీయ ఇన్వెస్టర్లకు భారీ ఆఫర్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. 50 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసేవారు స్వయంగా తనతోనే సమావేశం కావొచ్చని చెప్పారు. ఇక 200 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేవారికి పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యమున్న రాజభవంతిలో ఆతిథ్యమిస్తామని తెలిపారు. మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన ఆయన ఆఖరు రోజున భారత వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు.

అఫ్ఘానిస్తాన్ యుద్ధాల నీడల నుంచి బయటపడి సుసంపన్నంగా ఎదగడంలో భారత ఇన్వెస్టర్లు కీలక పాత్ర పోషించగలరని ఆశిస్తున్నట్లు ఘని చెప్పారు. తమ దగ్గర రైల్వేలు, విద్యుదుత్పత్తి, మైనింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. మేకిన్ ఇండియా తరహాలోనే భారత ఇన్వెస్టర్లు మేకిన్ అఫ్ఘానిస్తాన్‌కు చేయూతనిచ్చి, అక్కణ్నుంచి ఎగుమతులు చేసుకోవచ్చని ఘని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు వీసా నిబంధనలను సరళం చేయనున్నట్లు వివరించారు. 10 బిలియన్ డాలర్లతో చేపట్టిన తుర్క్‌మెనిస్తాన్-అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్-ఇండియా(టాపి) గ్యాస్ పైప్‌లైన్ వచ్చే అయిదేళ్లలో పూర్తి కాగలదని ఘని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు