రేప్ చేసి.. కళ్లు పీకి.. టెంపోలోంచి విసిరేసి..

26 Nov, 2013 11:35 IST|Sakshi
రేప్ చేసి.. కళ్లు పీకి.. టెంపోలోంచి విసిరేసి..

అసోంలో నలుగురు కీచకుల దుర్మార్గం
 ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు.. మహిళ మృతి
 ఆగ్రహించిన స్థానికులు.. జాతీయ రహదారి దిగ్బంధం

 
 లఖ్మీపూర్: ఓ మహిళపై నలుగురు కీచకులు వాహనంలో సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై ఆమె కళ్లు పీకేశారు.. తర్వాత వాహనంలోనుంచి బయటకు విసిరేశారు.. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటనకంటే దారుణంగా ఉన్న ఈ దుర్ఘటన అసోంలోని లఖ్మీపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బోగీనది ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల బాబును స్కూలు నుంచి తీసుకురావడానికి.. షేరింగ్ టెంపో వాహనం ఎక్కింది. అందులోని నలుగురు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. తర్వాత ఆమె కళ్లు పీకేశారు. ఆపై తలపైన, మెడపైన తీవ్రం గా గాయపరిచారు.
 
 ఓ ప్రాంతంలో ఆమెను కిందికి విసిరేశారు. బోగీనది పోలీస్ స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగిందని, ఎవరో టెంపో వాహనంలో నుంచి ఆమెను విసిరేయడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే ఆమెను గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఆసుపత్రిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన అటు స్థానికుల్లోను, ఇటు మహిళా సంఘాల్లోనూ ఆగ్రహం తెప్పించింది. నిందితులను వెంటనే పట్టుకొని అరెస్టు చేసి మహిళకు న్యాయం చేయాలంటూ సోమవారం వారంతా 52వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసుల హామీతో రెండు గంటల తర్వాత విరమించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు