మొక్కుబడిగానే అసెంబ్లీ

2 Sep, 2016 00:49 IST|Sakshi
మొక్కుబడిగానే అసెంబ్లీ

- రెండు, మూడు రోజులకు కుదించే అవకాశం
వెలగపూడిలో వచ్చే బడ్జెట్ సమావేశాలు
 
 సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు సీఎం చంద్రబాబును వెంటాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేసేందుకు అసెంబ్లీ సమావేశాలను కుదించడానికి టీడీపీ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. జీఎస్‌టీ బిల్లుతో పాటు రెండు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపేందుకే ఈ వర్షాకాల సమావేశాలను పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే సమావేశాలను రెండు లేదా మూడు రోజులకు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 8, 9 అసెంబ్లీ సమావేశాలు జరగడానికి అవకాశం ఉంది. 10వ తేదీ రెండో శనివారం కావడంతో ఆరో జు సమావేశాలు నిర్వహిస్తారా? లేదా అన్నది అనుమానమే. 11 ఆదివారం, 12 బక్రీద్ పర్వదినం కావడంతో సెలవు రోజుల్లో సమావేశాలు జరిగే అవకాశంలేదని టీడీపీ సీనియ ర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించా రు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిపామన్నది ముఖ్యం కాదని, ఒకసారి నిర్వహిస్తే 6 నెలల వరకు మళ్లీ నిర్వహించాల్సిన అవసరంలేదని ఆ నాయకుడు అన్నారు.

 ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకే..
 ఓటుకు కోట్లు వ్యవహారంలో పునర్విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. దీనికితోడు రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ పేరుతో అడ్డగోలు విధానం, రాష్ట్రంలో కరువు తీవ్రత, పుష్కరాల్లో నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం బదులివ్వలేని స్థితిలో ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెట్టే విమర్శలు, ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకునేందుకే సమావేశాలు కుదించినట్టు సమాచారం. వర్షాకాల సమావేశాలు కనీసం ఐదు రోజుల పాటు నిర్వహించే ఆనవాయితీ ఉంది. ప్రతిపక్షానికి, ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ ఆనవాయితీకి ఇప్పుడు తిలోదకాలిచ్చేస్తున్నారు.

 వెలగపూడిలో బడ్జెట్ సమావేశాలు..
 వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనంలోనే వచ్చే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై నిర్మాణ తీరుతెన్నులు సమీక్షించారు. డిసెంబర్ నాటికే ఆ భవనం నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు తెలిపారు. జనవరికి ఆ భవనాన్ని నిర్మించి అప్పగించాలని, అక్కడే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని యనమల చెప్పినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు