లోక్‌సభతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

26 Feb, 2014 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా జరిగే 16వ లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికలసంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోవంటూ వచ్చిన వార్తలను ఎన్నికల సంఘానికి చెందిన అత్యున్నత అధికారవర్గాలు ఖండించాయి. జూన్ 1 నాటికి గడువు ముగుస్తున్న శాసనసభలకు ఎన్నికలు జరపడం చట్టప్రకారం తప్పనిసరని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర విభజనతో సంబంధంలేకుండా లోక్‌సభ ఎన్నికలతోపాటే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ వర్గాలు తెలి పాయి.
 
 కొత్తరాష్ట్రం కోసం అధికారవర్గాల విభజన, మౌలిక సదుపాయాలు, ఆస్తులు, అప్పుల పంపకం, అసెంబ్లీ, కౌన్సిల్ ఏర్పాటుపై కేంద్రం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. మే చివరివారానికి ఎన్నికలు పూర్తవుతాయని, జూన్ 1న అపాయింటెడ్ డేను ప్రకటించినా కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అపాయింటెడ్ డేను ఎన్నికల సమయంలో ప్రకటించేందుకూ ఎలాంటి ఇబ్బందుల్లేవని కేంద్రప్రభుత్వ వర్గాల సమాచారం.
 
 

మార్చి 3 తర్వాత షెడ్యూల్ ప్రకటన: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 28న ప్రకటిస్తారని భావించినప్పటికీ, కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60నుంచి 65 ఏళ్లకు పెంచుతూ యూపీఏ ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకటన కొంత ఆలస్యం కావచ్చని విశ్వసనీ య వర్గాల సమాచారం. ఈ మేరకు లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను మార్చి 3 తర్వాత ప్రకటించవచ్చని తెలుస్తోంది. పరీక్షలు, సెలవులు, పండగలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్-మే నెలల్లో 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించే వీలున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.
 
 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో తొలివిడతలోనే!: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న 33 జిల్లాలకు తొలివిడతలోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్రం హోంశాఖ అభ్యర్థించింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో తొలివిడతలోనే ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కువ భద్రత కల్పించే అవకాశం ఉంటుందని, దీనివల్ల హింసాకాండను నిరోధించవచ్చని పేర్కొంది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికలు, 2008, 2009, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించింది. మన రాష్ర్టంలోని విశాఖ, ఖమ్మం, మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి, ఒడిశాకు చెందిన మల్కన్‌గిరి, కోరాపుట్, నౌపద, బోలన్‌గిరి ఈ జాబితాలో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు