జనాభా ప్రాతిపదికనే.. ఆస్తులు, అప్పుల పంపిణీ

7 Dec, 2013 03:07 IST|Sakshi
జనాభా ప్రాతిపదికనే.. ఆస్తులు, అప్పుల పంపిణీ

 అప్పులు రూ. 1,51,450 కోట్లు
సీమాంధ్రది రూ. 85,310 కోట్లు
తెలంగాణది రూ. 66,140 కోట్లు

 
సాక్షి, హైదరాబాద్: అప్పులు, ఆస్తులు, ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో, వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను కూడా జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేయనున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా ఇదే ప్రాతిపదికన పంపిణీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ. లక్షన్నర కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తం రాష్ట్రానికి చేసిన అప్పులు సుమారుగా రూ. 1,42,000 కోట్లు కాగా...  విదేశీ సంస్థల నుంచి సీమాంధ్ర ప్రాంతానికి ప్రయోజనం కలిగే ప్రాజెక్టుల కోసం రూ. 2,950 కోట్లు, తెలంగాణ జిల్లాల్లో ప్రయోజనం కలిగేవాటికి రూ. 1350 కోట్లు, కేవలం హైదరాబాద్ కోసం రూ. 4,200 కోట్లు.. మొత్తంగా రూ. 8500 కోట్లు కలిపి సుమారు రూ. లక్షన్నర కోట్ల  అప్పులున్నాయి.
 
  ప్రాంతాల వారీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించి, లెక్కించగా... సీమాంధ్ర వాటా అప్పు రూ. 85,310 కోట్లు, తెలంగాణ వాటా రూ. 66,140 కోట్లుగా తేల్చారు. రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున ఆయిల్ కంపెనీలు, ఆబ్కారీ శాఖలు అన్ని జిల్లాల వ్యాట్‌ను అక్కడే చెల్లిస్తున్నారు. ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయాల్సి ఉన్నందున... ఏయే జిల్లాల్లో వినియోగానికి సంబంధించి, ఆ జిల్లాలోనే వ్యాట్ చెల్లించాలని స్పష్టం చేశారు. ఆదాయ పంపిణీని కూడా ఇరు రాష్ట్రాల మధ్య లెక్క తేల్చారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఆదాయం రూ. 1,27,000 కోట్లు కాగా... అందులో స్థానిక వినియోగం ఆధారంగా హైదరాబాద్‌లో రూ. 20,000 కోట్లు, మిగతా తెలంగాణ జిల్లాల్లో రూ. 41,000 కోట్లు, సీమాంధ్రలో రూ. 66,000 కోట్లుగా తేల్చారు.

మరిన్ని వార్తలు