స్వచ్ఛంద సంస్థగా ఏజేఎల్

22 Jan, 2016 03:42 IST|Sakshi
స్వచ్ఛంద సంస్థగా ఏజేఎల్

లక్నో: కోర్టు కేసులను ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ దినపత్రిక యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్).. ఇకపై వాణిజ్య సంస్థ కాదు. అది ఇక స్వచ్ఛంద సంస్థ. చాలా కాలం కిందట నిలిచిపోయిన వార్తా పత్రికల ప్రచురణను పునఃప్రారంభించాలని కూడా ఆ సంస్థ భాగస్వాములు నిర్ణయించారు. గురువారం లక్నోలో ఏజేఎల్ భాగస్వాముల అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కంపెనీల చట్టం 2013 కింద.. లాభార్జన కోసం కాని సెక్షన్ 8 సంస్థగా మార్చేందుకు ఉద్దేశించిన పలు ప్రతిపాదనలను వాటాదారులు పరిశీలించి ఆమోదించారని ఏజేఎల్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్ ఓరా విలేకరులకు తెలిపారు. మూడు గంటలకు పైగా కొనసాగిన భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..

సంస్థ ప్రచురణలను కూడా  పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏజేఎల్ భాగస్వాములైన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలు కూడా పరోక్షంగా తమ ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఏజేఎల్‌ను 2010లో యంగ్ ఇండియన్ కంపెనీకి అప్పగించటంలో అవినీతి చోటు చేసుకుందంటూ.. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ లతో పాటు మరో ఐదుగురిపై బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి క్రిమినల్ కేసు దాఖలు చేయటం,  ఢిల్లీ కోర్టు వారికి సమన్లు జారీ చేయటం, వారు కోర్టుకు హాజరవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పటం, వారు గత నెలలో కోర్టుకు హాజరవటం.. ఈ కేసుపై రాజకీయ దుమారం రేగటం తెలిసిందే.

ఏజేఎల్‌ను స్వచ్ఛంద సంస్థగా మార్చిన నిర్ణయాల ప్రభావం కేసుపై ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా.. కేసు కోర్టులో ఉందని, తమ నిర్ణయాల ప్రభావం కేసుపై ఉండబోదని ఓరా బదులిచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, శ్యాంపిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీలాదీక్షిత్, సలీమ్‌షేర్వాణి, రత్నాసింగ్, జితిన్‌ప్రసాద, సయ్యద్‌సిబ్తేరజీ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు