76 ఏళ్ల వయసులోనూ...

22 Jun, 2016 15:55 IST|Sakshi
76 ఏళ్ల వయసులోనూ...

ఆమె ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కర్ర తిప్పే తీరు గమనిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వయసుతో సంబంధం లేకుండా  కర్రసాము కత్తి ఫైట్లతో ఇప్పుడా వృద్ధ మహిళ ఇంటర్నెట్ యూజర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రాచీన యుద్ధ కళా విన్యాసాల్లో తనదైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి  ఫేస్ బుక్ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసిన వీడియో... లక్షలకొద్దీ వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది.

కేరళ వటకారా లో నివసిస్తున్న మీనాక్షియమ్మ వయసు 76 సంవత్సరాలు. ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పురాతన భారతీయ యుద్ధ కళారూపం కలరిపయట్టు (కర్రసాము) లో నేటికీ అనేక మంది విద్యార్థులకు శిక్షణనిస్తూ అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తోంది.  కర్రలు, కత్తులు, బాకులు ఉపయోగించి చేసే కర్రసాములో ఆమె చూపించిన విన్యాసాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించాయి. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన, పురాతన కాలంనాటి కళగా గుర్తింపుపొందిన కర్రసాము బోధకురాలుగా మీనాక్షిమమ్మ ఎంతో గుర్తింపు పొందింది. ఏడు పదుల వయసు దాటినా ఆమె నేటికీ తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది.  

మీనాక్షియమ్మ వీడియో... ఫేస్ బుక్ లో ఇండియా అరైజింగ్ పేరున జూన్ 16న పోస్ట్ చేశారు. ఆ అద్భుత విన్యాసాల వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షియమ్మ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోపే సుమారు 9 లక్షలమంది పైగా వీక్షించారు. వయోవృద్ధురాలైన ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ముగ్ధులైపోతున్నారు.

కర్రను చేతపట్టి,  చీరకొంగు నడుముకు చుట్టి ఓ వ్యక్తితో ఆమె  తలపడిన తీరును చూస్తే నిజంగా అద్భుతం కళ్ళకు కడుతుంది. చూపరులు ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. తనకన్నా వయసులో అతి చిన్నవాడు, ఆమె వద్దే శిక్షణ పొందిన వ్యక్తితో ఆమె యుద్ధకళను ప్రదర్శించిన తీరు ఫేస్ బుక్  ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కేరళ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కలరిపయట్టు, పురాతన కాలానికి చెందిన ఓ ప్రత్యేక యుద్ధకళగా  ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కళ అత్యంత క్లిష్టమైన విద్యగా కూడ పేరొందింది.

మరిన్ని వార్తలు