దావూద్‌ బంధువు పెళ్లి: చిక్కుల్లో మంత్రి, పోలీసులు

25 May, 2017 12:23 IST|Sakshi
దావూద్‌ బంధువు పెళ్లి: చిక్కుల్లో మంత్రి, పోలీసులు

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  బంధువు పెళ్లికి హాజరైన  రాష్ట్ర మంత్రి , నాసిక్‌ మేయర్‌, పోలీసు ఉన్నతాధికారులు ఇబ్బందుల్లో పడ్డారు.  ముఖ్యంగా మహారాష్ట్ర   ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవిస్   ప్రధాన అనుచరుడు  , వైద్య విద్యాశాఖమంత్రి  గిరీష్ మహాజన్   గాంగ్‌స్టర్‌  దావూధ్ బంధువుల వివాహానికి హాజరు కావడం  దుమారాన్ని రేపింది. అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్,  ఇద్దరు సీనియర్ ఇన్స్పెక్టర్లతో సహా ఎనిమిది మంది పోలీసు అధికారులు ఈ వివాహానికి హాజరయ్యారు.  దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లోని  దావూద్ ఇబ్రహీం  బంధువు జగ్గి కొంకణి కుమార్తె   వివాహం ఆధ్యాత్మిక గురువు ఖతిబ్  కుమారుడితో  మే 19న జరిగింది. దావూద్ భార్య ,వధువు తల్లి  తోబుట్టువులని నాసిక్ పోలీస్ కమీషనర్ రవీంద్ర సింఘాల్  నిర్ధారించారు.  నాసిక్‌ మేయర్ రంజనా భనసి, డిప్యూటీ మేయర్ ప్రథమేష్ గైట్,  బిజెపి శాసనసభ్యులు దేవని ఫరాండే, బాలసాహెబ్ సనాప్, సీమా హిరా, స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లు తదితరులు  ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు.   దీంతో ఈ వివాహానికి హాజరైన పోలీసు అధికారులపై  రవీంద్ర సింఘాల్  అంతర్గత విచారణ చేపట్టామన్నారు.   వీరి స్టేట్‌మెంట్లను  నమోదు  చేసినట్టు  చెప్పారు. అలాగే  సెలవులో ఉన్న కొంతమంది  అధికారులపై అంతర్గత విచారణ పూర్తిచేయడానికి  మరో రెండు రోజులు పడుతుందని పోలీసు కమిషనర్ చెప్పారు. అభ్యంతరకరమైన,  తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సంబంధిత నివేదికను కోసం మా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. 

ముస్లిం మత పెద్దల ద్వారా ఈ ఆహ్వానాలు ఎంఎల్‌ఏలకు, పోలీసు అధికారులకు, మరికొంతమంది కార్పొరేటర్లకు అందాయని  ఆయన  చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రులను ప్రశ్నించలేమని  సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.  వివాహాలు, సామాజిక కార్యక్రమాలకు హాజరు కావద్దని తాము ఎవరినీ అడ్డుకోలేమన్నారు.అయితే  పెళ్లికి హాజరయ్యేంతవరకు ఇది దావూద్‌ బంధువుల వివాహమని తనకు తెలియదని   మంత్రి మహాజన్‌  చెప్పడం విశేషం.


 

మరిన్ని వార్తలు