కుప్పకూలిన విమానం; 36 మంది మృతి

5 Nov, 2015 04:08 IST|Sakshi
కుప్పకూలిన విమానం; 36 మంది మృతి

36 మంది మృతి.. సూడాన్‌లో దుర్ఘటన
 
 జుబా: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్‌లో బుధవారం ఓ రవాణా విమానం కూలిపోయింది. దక్షిణ  సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి సుమారు 800 మీటర్లదూరంలోనే నైలునదిలోని ఓ చిన్న ద్వీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో సుమారు 36 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి సహాయంతో నడుస్తున్న రేడియో మరియా తెలిపింది.

విమానం కూలిన ద్వీపంలో కొన్ని రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, విమానం కూలినకారణంగా దానికిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, విమానం శకలాలు నది వెంట చెల్లాచెదురుగా పడ్డాయని ఆ వార్తలు తెలిపాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారని ఓ వార్తాసంస్థ విలేకరి తెలిపారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సూడాన్‌లో జుబా విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. పలు వాణిజ్య, రవాణా విమానాలే కాకుండా మిలిటరీ విమానాలు కూడా ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటాయి.
 
 ద్వీపం వద్ద కూలి ముక్కలుచెక్కలైన విమానం. పక్కన పడి ఉన్న మృతదేహాలు

మరిన్ని వార్తలు