అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడోలు

24 Dec, 2015 13:17 IST|Sakshi
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడోలు

మిసిసిపి: పెనుగాలి(టోర్నడో) అమెరికాను కుదిపేస్తోంది. టోర్నడోల కారణంగా దేశవ్యాప్తంగా కనీసం ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. 40 మందిపైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఇండియానా, మిసిసిపి రాష్ట్రాలపై టోర్నడోలు ప్రతాపం చూపాయి.

ఆర్కాన్సాస్ ప్రాంతంలో ఇల్లుపై చెట్టు కూలిపోవడంతో 18 ఏళ్ల యువతి మృతి చెందింది. ఏడాది శిశువును రక్షించారు. టెన్నెసీ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. బెంటన్ కౌంటీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ లేకుండా పోయారు. వీరి జాడ కనుగొనేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పెనుగాలికి క్లార్క్స్ డేల్ చిన్న విమానాశ్రయంలో విమానాలు తల్లక్రిందులయ్యాయని మేయర్ బిల్ లకెట్ తెలిపారు. టోర్నడోలు పలుచోట్ల విధ్వంసం సృష్టించాయని చెప్పారు. 10 నిమిషాల పాటు టోర్నడో సృష్టించిన బీభత్సాన్ని స్థానిక టీవీ చానళ్లు ప్రచారం చేశాయి.

మరోవైపు ఇంటర్ స్టేట్ 55 రహదారిని రెండు వైపుల మూసివేసినట్టు మిసిసిపి హైవేస్ పాట్రోల్ అధికారులు తెలిపారు. మిసిసిపితో పాటు మిస్సౌరి, ఇలినాయిస్, కెంటుకీలకు టోర్నడోల ముప్పు పొంచివుందని ఒక్లాహామాలోని నేషనల్ స్టార్మ్ ప్రిడిక్షన్ సెంటర్ హెచ్చరించింది. 193 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముందని పౌరులను అప్రమత్తం చేసింది.
 

మరిన్ని వార్తలు