మా పిల్లల సృష్టే జియో

1 Sep, 2016 14:12 IST|Sakshi
మా పిల్లల సృష్టే జియో
ముంబై : రిలయన్స్ జియో ప్లాన్... యువత కోసం యువత తయారుచేసిన డేటా ప్యాక్. రిలయన్స్ జియోలో రెండేళ్ల క్రితం డైరెక్టర్లుగా చేరిన తన కుమారుడు ఆకాష్, కుమార్తె ఈషా మనసులో వచ్చిన ఆలోచనే జియో డేటా టారిఫ్ల రూపకల్పనకు పునాదని చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. డేటా వాడకం దిశగా భారతీయ యువత ఎంత మొత్తంలో డబ్బు వెచ్చిస్తోంది. నెలకు ఎంత డేటా సరాసరి అవసరమవుతుందో పరిగణలోకి తీసుకుని ఈ ప్లాన్ను తయారుచేసినట్టు వెల్లడించారు. భారత్లో స్మార్ట్ ఫోన్ యూజర్ల సరాసరి వయసుకు దగ్గరగా ఉన్న 24 ఏళ్ల ఆకాష్, ఈషాలు యువతరానికి ప్రతినిధులుగా  తాను నమ్ముతున్నట్టు ముఖేష్ ప్రకటించారు. ఈ ప్రకటనను షేర్ హోల్డర్లు హర్షధ్వానాల మధ్య స్వాగతించారు.  ఇండియాలో ఇకపై 'గాంధీగిరి' స్థానంలో 'డేటా గిరి' వస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా చార్జీలతో పోలిస్తే 10 శాతం చార్జీతోనే తాము డేటాను అందిస్తామని తెలిపారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 శాతం కన్నా తక్కువ వయసున్నవారే ఉంటారని అన్నారు. తమ కంపెనీలో పనిచేసే వారి సగటు వయసు కూడా 30 ఏళ్లేనని ప్రకటించారు. 
 
యువకుల కోసం యువకులు తీసుకొచ్చిన ఈ జియో టారిఫ్ ప్లాన్ యూజర్లకు ఎంతో కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ తో పాటు జియో డైరెక్టర్లుగా ఉన్న ఆకాష్, ఈషా, చిన్న కుమారుడు అనంత్, భార్య నీతా అంబానీ, గ్రాండ్ మదర్ కోకిలా బెన్ పాల్గొన్నారు.  జియో డేటా ప్లాన్ రూపకల్పనకు బాధ్యత వహించిన ఈషా, ఆకాష్లు కవలలు. బ్రౌన్ యూనివర్సిటీలో ఆకాష్ ఎకనామిక్స్ ప్రధానాంశంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఈషా యెల్ యూనివర్సిటీలో చదువుకుంది. సైకాలజీ, సౌత్ ఆసియన్ స్టడీస్లో డబుల్ మేజర్స్గా ఈషా గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. మెక్ ఇన్సేలో ఈషా బిజినెస్ విశ్లేషకురాలిగా పనిచేసింది.  రెండేళ్ల క్రితమే వీరు రిలయన్స్ రీటైల్ వెంచర్స్కు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. 
మరిన్ని వార్తలు