కార్పొరే ట్ల ఆదాయ వృద్ధి అంతంతే

8 Oct, 2015 01:19 IST|Sakshi
కార్పొరే ట్ల ఆదాయ వృద్ధి అంతంతే

క్యూ2పై క్రిసిల్ అంచనా
 
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్పొరేట్ల ఆదాయాలు స్వల్పంగా 1.6 శాతమే పెరిగే అవకాశముందని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. అదే జరిగితే వరుసగా అయిదో క్వార్టర్‌లోనూ ఒక్క అంకె స్థాయి వృద్ధి మాత్రమే సాధించినట్లవుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉండటం, పెట్టుబడుల ఆధారిత రంగాలు బలహీనంగా ఉండటంతో పాటు అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు క్షీణించడం తదితర అంశాలు.. ఎగుమతి ఆధారిత రంగ సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ క్వార్టర్‌లో కార్పొరేట్ల ఆదాయం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.6 శాతం స్థాయిలోనే వృద్ధి చెందవచ్చని పేర్కొంది. నిర్వహణ లాభం వృద్ధి కేవలం 2 శాతం మేర ఉండొచ్చని తెలిపింది. 600 కంపెనీల (ఫైనాన్షియల్, చమురు..గ్యాస్ సంస్థలను మినహాయించి) పనితీరు అధ్యయనం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు క్రిసిల్ వివరించింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువలో ఈ కంపెనీల వాటా దాదాపు 70 శాతం పైగా ఉంటుంది.

 పూర్తి ఆర్థిక సంవత్సరం పరిమితమే..
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. వినియోగం.. ప్రభుత్వ వ్యయాలు స్వల్పంగా పెరగడం, లో-బేస్ ఎఫెక్ట్ తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం వృద్ధి ఒక అంకె స్థాయికే పరిమితం కావొచ్చని పేర్కొంది. ఎగుమతి ఆధారిత సంస్థల ఆదాయాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉండగలవని క్రిసిల్ వివరించింది.
 

మరిన్ని వార్తలు