ఆ ఏటీఎంలు కూడా నిండుకున్నాయట!

18 Nov, 2016 13:29 IST|Sakshi
ఆ ఏటీఎంలు కూడా నిండుకున్నాయట!

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ సెగ పార్లమెంట్ ఆవరణలోని ఏటీఎం సెంటర్లను కూడా తాకింది. ఒక పక్క శీతాకాల పార్లమెంట్  సమావేశాల ఉభయ సభల్లోనూ ఆపరేషన్ బ్లాక్ మనీ ప్రకంపనలు రేపుతోంది. మరోపక్క  పార్లమెంట్ బయట ఏటీఏం కేంద్రాలకు కరెన్సీ కష్టాలు చుట్టుకున్నాయి.. పార్లమెంటు ఆవరణలోని  రెండు  ఏటీఎంలు గురువారం నగదులేక వెలవెలబోయిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.  పార్లమెంట్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు, కొంతమంది జర్నలిస్టులు  ఇక్కడున్న రెండు  ఏటీఎం కేంద్రాలవద్ద  బారులు తీరారు.  కానీ అంతలోనే క్యాష్ అయిపోవడంతో  అందరూ నీరసించారు. 

అయితే ఆర్బీఐ కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయానికి అతి  సమీంపలోని ఏటీఏం కేంద్రాలలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగిలిన ఏటీఎం సంగతి ఏంటన్న నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారంపై సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బు  ఉంటే  ఏటీఎంలలో ఉంటుందంటూ చమత్కరించడం విశేషం.

కాగా నవంబరు 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రూ.500, రూ. 1000  నోట్ల రద్దు  ప్రకటనతో  దేశవ్యాప్తంగా  సంచలనం రేగింది.  పెద్దనోట్ల రద్దుతో ఏటీఎం సెంటర్ల దగ్గరకు  బ్యాంకుల వద్దకు  ప్రజలు   పరుగులు తీస్తున్నారు. అయితే గంటల కొద్దీ  క్యూ లైన్లలో నిలబడినా  చివరకు నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు నగదు నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ బీఐ, ఆర్థిక శాఖ భరోసా ఇస్తున్న సంగతి తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు