కాబుల్‌పై ఐసిస్‌ పంజా

9 Mar, 2017 03:17 IST|Sakshi
ఆస్పత్రి బయట అప్రమత్తంగా ఉన్న సైనికులు

ఆర్మీ ఆసుపత్రిపై దాడిలో 30 మంది దుర్మరణం
ఆరుగంటల ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రమూకల ఏరివేత


కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌ బుధవారం మరోసారి బాంబు పేలుళ్లు, తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి అతిపెద్ద మిలిటరీ ఆసుపత్రి సర్దార్‌ దౌడ్‌ ఖాన్‌ హాస్పిటల్‌లోకి వైద్యుల దుస్తుల్లో చొరబడిన ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మందికి పైగా మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఆసుపత్రి వెనక ద్వారం వద్ద ఓ బాంబర్‌ తనను తాను పేల్చేసుకున్న తరువాత ముగ్గురు సాయుధులు రోగులు, వైద్య సిబ్బందిపై బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది.

ఆసుపత్రి పార్కింగ్‌ స్థలంలో కారులో బాంబు పేలుడుతో పాటు మరో భారీ పేలుడు జరిగినట్లు తెలిసింది. ఆ తరువాత అఫ్గాన్‌ ప్రత్యేక భద్రతా దళాలు చేపట్టిన ఆరుగంటల ఆపరేషన్‌లో ముష్కరులు హతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా భద్రాతా దళాలు ఆసుపత్రి పైకప్పుపై దిగి దుండగుల పనిపట్టాయని వెల్లడించారు. ఈ దాడికి బాధ్యత తమదే అని ఇస్లామిక్‌ స్టేట్‌ జిహాదిస్టులు టెలిగ్రాం అకౌంట్‌ ద్వారా ప్రకటించారు. ఇందులో తమ పాత్ర లేదని తాలిబన్‌ స్పష్టం చేసింది. అంతకుముందు..ఆసుపత్రి వార్డుల్లో చిక్కుకున్న వైద్య సిబ్బంది సాయం కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. భయంతో కొంతమంది పై అంతస్తులోని కిటికీ చూరుపై దాక్కున్నట్లు టీవీ ఫుటేజీల్లో కనిపించింది.

మరిన్ని వార్తలు