టోకు ధరలు మళ్లీ ఎగిశాయ్!

14 Sep, 2016 12:47 IST|Sakshi
టోకు ధరలు మళ్లీ ఎగిశాయ్!
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) మళ్లీ పెరిగింది. జూలై నెలలో 3.55 శాతానికి ఎగబాకి మార్కెట్ వర్గాలను నిరాశపరిచిన ఈ ద్రవ్యోల్బణం, మళ్లీ ఆగస్టు నెలలో 3.74 శాతానికి ఎగిసింది. అయితే ఈ పెరుగుదల తక్కువగానే నమోదైంది. ప్రభుత్వం  బుధవారం విడుదలచేసిన తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. జూలై నెలలో 11.82శాతంగా ఉన్న ఆహార ధరల ఇండెక్స్ ఆగస్టు నెలలో 8.23 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐలో ఎక్కువ శాతం కలిగి ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు ఆగస్టు నెలలో 2.42 శాతం ఎగిశాయి. జూలైలో ఈ ధరలు 1.82 శాతంగా ఉన్నాయి. గతవారంలో విడుదల చేసిన వినియోగదారుల ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో ఐదు నెలల కనిష్టానికి పడిపోయి రేట్ల కోతకు అవకాశం కల్పించగా ఈ ద్రవ్యోల్బణం కొంత నిరాశపరిచింది. 
 
అయితే వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీలో ఆహార ధరల పెరుగుదల అదుపులోకి రావడంతో వచ్చే నెలలో విడుదల చేసే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ రేట్లకు కోత పెడతారని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆర్బీఐ విడుదలచేసే మానిటరీ పాలసీలో వినియోగదారుల ద్రవ్యోల్బణాన్నే పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంటున్నారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్భణంలో కంటే వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీలోనే ఆహార ధరలు ఎక్కువ శాతాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. జూన్ నెలతో పోలిస్తే జూలైలో దాదాపు రెట్టింపు శాతం పెరిగిన ఈ ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం మార్కెట్ వర్గాలు కొంత విస్మయ పరుస్తుంది. ఈ డేటా విడుదల అనంతరం మధ్యాహ్నం సెషన్లో మార్కెట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 28,356 వద్ద, నిఫ్టీ 8,723 వద్ద లాభనష్టాల్లో ఊగిసలాడుతున్నాయి.    
మరిన్ని వార్తలు