మోదీ ఆప్తుడికి చుక్కెదురు

5 Aug, 2015 10:57 IST|Sakshi
మోదీ ఆప్తుడికి చుక్కెదురు

సిడ్నీ: ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన భారత పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి ఆస్ట్రేలియాలో చుక్కెదురైంది. క్వీన్స్లాండ్స్లోని క్లర్మాంట్కు సమీపంలో ఆయన కంపెనీ ప్రారంభించిన భారీ బొగ్గు వెలికితీత ప్రాజెక్టును స్థానిక కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. అదానీ సంస్థ నిర్వహిస్తున్న పనులు.. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయన్న పర్యావరణవేత్తల వాదనతో కోర్టు ఏకీభవించింది. పూర్తి వివరాలు..

కార్మిచాయెల్ కోల్మైన్, రైల్ అండ్ పోర్ట్ ప్రాజెక్టు పేరుతో ఉత్తర గెలిలీ బేసిన్ (క్వీన్స్లాండ్ రాష్ట్రం)లో అదానీ గ్రూపు భారీ ప్రాజెక్టును చేపట్టింది. 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా చరిత్రలో అతి పెద్ద కోల్ మైన్ ప్రాజెక్టు కావడం విశేషం. బేసిన్ చూట్టూరా దాదాపు 160 నుంచి 400 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును విస్తరిస్తారు. అయితే సరిగ్గా అదే ప్రాంతం ప్రపంచంలోనే అరుదైన జీవవైవిధ్యం కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరుపొందింది. కానీ ఎలాగోలా అనుమతులు వచ్చాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కాగా, మొదటినుంచి ఈ ప్రాజెక్టును జీవనాశినిగా పేర్కొంటున్న పర్యావరణ వేత్తలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వీరి ఆందోళనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. నిజానికి కోర్టు కూడా ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపకపోయినప్పటికీ జీవవైవిధ్యం విషయంలో మాత్రం స్పందించింది. పర్యావరణ పరిరక్షకు తగిన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని, అప్పటివరకు అదానీ గ్రూప్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం తీర్పు వెలువరించింది. ఆరువారాల వ్యవధిలోగా పర్యావరణహిత కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు