వెనిస్ వెళుతున్న ఆటో డ్రైవర్

8 Sep, 2015 08:22 IST|Sakshi
వెనిస్ వెళుతున్న ఆటో డ్రైవర్

అవకాశం వస్తే సామాన్యులూ సెలబ్రిటీలవుతారు. తమిళనాడులోని కోయంబత్తూర్ నగరానికి చెందిన చంద్రకుమార్ అనే ఆటో డ్రైవర్‌కు కూడా అలాంటి అవకాశమే వచ్చింది. ఇటలీలోని వెనిస్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఉదయం బయల్దేరి విమానంలో వెళ్తున్నారు. ఆయన రాసిన ఓ నవల ఆధారంగా తీసిన చిత్రాన్ని అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు వెట్రిమారన్ ఆహ్వానంపై ఆయనకు ఈ అవకాశం లభించింది.

51 ఏళ్ల ఎం. చంద్రకుమార్ ఆటో చంద్రన్‌గా కోయంబత్తూర్ ప్రజలకు సుపరిచితం. పదో తరగతిలోనే ఇంటి నుంచి పారిపోయారు. అప్పుడే చదువుకు స్వస్తి చెప్పారు. బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలు తిరిగారు. కడుపు నింపుకోవడానికి కాయకష్టం చేశారు. జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ దొరికిన పనల్లా చేశారు. ఓసారి ఏ కారణం లేకుండానే ఆయన్ని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 13 రోజుల పాటు స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.

ఆనాటి తన అనుభవాలను 'లాకప్' పేరుతో ఓ నవలగా రాశారు. నిస్సహాయులైన పేదలకు ఈ సమాజంలో రక్షణ లేదనే విషయాన్ని ఆ నవలలో కళ్లకు కట్టినట్టు చెప్పారు. 2006లో ఆ నవలకు 'బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్' అనే అవార్డు కూడా వచ్చింది. ఆ నవల గురించి మిత్రుల ద్వారా తెలుసుకున్న వెట్రిమారన్ ఆ నవల ఆధారంగా తమిళంలో ఇటీవలనే సినిమా తీశారు. టైటిల్స్‌లో చంద్రన్‌కు క్రెడిట్ కూడా ఇచ్చారు. సినీ నటుడు ధనుష్ దీనికి నిర్మాతగా వ్యవహరించగా, అట్టకతి దినేశ్, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. దీన్ని వెనిస్‌లో సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమైన 72వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. 12వ తేదీతో ఈ చిత్రోత్సవం ముగుస్తుంది. కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని రాష్ట్రంలో ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా ప్రకటించలేదు.

ఆటో చంద్రన్ ఇప్పటి వరకు ఆరు భిన్నమైన నవలలు రాశారు. టెర్రరిజంపైన, కమ్యూనిస్టు నాయకుడు పీ. జీవానందం జీవిత చరిత్రపై పుస్తకాలు రాశారు. తాను సాధారణంగా ట్రాఫిక్ జామ్‌లలో ఇరుక్కున్నప్పుడు, ప్రయాణికుల కోసం నిరీక్షిస్తున్న సమయాల్లో నవలలు రాస్తానని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు