బేకార్ టెక్...!

21 Oct, 2013 01:31 IST|Sakshi
బేకార్ టెక్...!
 
‘‘అన్నా.. బీటెక్ అయిపోయి రెండేళ్లయ్యింది. కాలేజీలో నేర్చుకున్న అంతంత మాత్రం సబ్జెక్టు కూడా మరిచిపోతున్నా. హైదరాబాద్ వచ్చి కంపెనీల్లో ఉద్యోగం వెతుక్కునే స్తోమత లేదు. ఇక్కడే ఏదైనా కళాశాలల్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించన్నా..’’
 - పి.శ్రీనివాస్ అనే సీఎస్‌ఈ గ్రాడ్యుయేట్ వేడుకోలు
 
 ‘‘బీటెక్ పూర్తయింది. ఏడాది గడిచిపోయింది. కళాశాలలో నేర్చుకున్నదేమీ లేదు. హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థలో రూ.17 వేలు చెల్లించి కోర్ జావా కోర్సు నేర్చుకున్నా. కానీ ఫ్రెషర్లకు ఎక్కడా ఉద్యోగాలు దొరకడం లేదు..’’
 - బీటెక్ పట్టభద్రుడైన వెంకట్‌రెడ్డి ఆవేదన
 
 ...ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు.. రాష్ట్రంలో లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల దుస్థితి. చదువుల్లో గట్టెక్కినా, ఉద్యోగం మెట్టెక్కలేక తడబడుతున్న విద్యార్థుల వెతలివి. సాంకేతిక విద్య పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదంటూ లక్షలాది మంది తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. 2012-13 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని కాలేజీల నుంచి బయటికి వచ్చిన 1.25 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 25 వేల మందికే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభించాయి. మిగిలిన వారికి కొలువు తిప్పలు తప్పడం లేదు. బీటెక్ పూర్తయినవారిలో చాలా మంది తమ చదువులతో సంబంధం లేని చిన్నాచితక ఉద్యోగాల్లో చేరిపోతుండగా.. మిగతావారు అయిష్టంగానే పైచదువులకు వెళ్తున్నారు.
 
2012-13 విద్యా సంవత్సరానికి ముందు కూడా ఇదే పరిస్థితి. ఇలా ఏటా దాదాపు లక్ష మంది పట్టభద్రులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారు. చేరిన ఉద్యోగాల్లో పట్టుమని రూ.10 వేల వేతనం కూడా లేని పరిస్థితుల మధ్య ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మానసిక వేదనకు లోనవుతున్నారు. ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న వారికీ నిరాశే మిగులుతోంది. ఐదారేళ్ల అనుభవం ఉన్న వారిని మినహా ఫ్రెషర్లను పట్టించుకున్న కంపెనీ ఒక్కటీ లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఓయూ, ఏయూ, ఎస్వీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 1.25 లక్షల మంది ఉత్తీర్ణులైనట్టు సాంకేతిక విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. లక్షల మంది కాలేజీల్లో చేరుతున్నా.. వారిలో ఉత్తీర్ణులై బయటకు వస్తున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువే ఉంది. అటు ల్యాబ్ వసతులు, ఇటు బోధనా ప్రమాణాలు లేకపోవడంతో ఫెయిల్ అవుతున్నవారు కొందరైతే.. పాసవుతున్నా ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నవారు ఎందరో ఉన్నారు.
 
 అన్ని రంగాల్లో ఉద్యోగాలు కరువు..
రాష్ట్రంలో 710 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు దాదాపుగా 30-60 కళాశాలలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని విద్యార్థులకు ఐటీ రంగంలో 2004-05 నుంచి 2008-09 మధ్య ఏటా 50 వేలకు పైగా (ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీ బ్రాంచీలతో కలిపి) కొత్త ఉద్యోగవకాశాలు దక్కేవి. 2010-11లో ఆ సంఖ్య 27 వేలకు పడిపోయింది. గడిచిన మూడేళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యం ఏర్పడడంతో అటు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా అవకాశాలు సన్నగిల్లాయి. నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడివక్కడ ఆగిపోవడం కూడా వీరి అవకాశాలకు గండికొట్టింది. రాష్ట్రంలో కొత్తగా నేదునూరు, శంకరపల్లి ప్రాంతాల్లో విద్యుత్తు ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఎలక్ట్రికల్ పట్టభద్రులకు నిరాశే మిగిలింది. అలాగే గడిచిన రెండేళ్లలో తీవ్ర విద్యుత్తు కోతలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి. కొత్త పట్టభద్రులు వైపు చూడడమే మానేశాయి. ఫ్యాబ్‌సిటీ, ఈ-సిటీ అంటూ ప్రభుత్వం నిరుద్యోగులను ఊరించినా.. వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
 
 బ్యాంకింగ్ రంగం వైపు చూపు..
 రాష్ట్రంలో అటు ప్రభుత్వరంగ ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితి లేకపోవడం, ఇటు ప్రైవేటు రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో బీటెక్ పట్టభద్రులకు ఒక్క బ్యాంకింగ్ రంగమే ఆశాజనకంగా కనిపిస్తోంది. ‘‘రెండు మూడేళ్లు ఏటా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పెద్ద ఎత్తున విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నాయి. త్వరలోనే కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు దక్కుతాయన్న వార్తలు వస్తుండడంతో బ్యాంకింగ్ ఉద్యోగాలపై తాజా పట్టభద్రులు ఆశలు పెంచుకుంటున్నారు’’ అని అమీర్‌పేట్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్న కె.శ్రావణ్ పేర్కొన్నారు. బ్యాంకు కొలువుల వైపు బీటెక్ పట్టభద్రులు మొగ్గు చూపుతుండడంలో రాజధానిలోని బ్యాంకింగ్ ఉద్యోగ శిక్షణ సంస్థలు విద్యార్థులతో  నిండిపోయాయి. అయితే కోచింగ్‌కు రూ.7, 8 వేలు, హాస్టల్‌కు రూ.3 వేల చొప్పున వెచ్చించ గలిగే స్తోమత ఉన్న వారే ఈ శిక్షణ పొందుతున్నారు. అంత ఆర్థిక స్తోమత లేనివారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఇంటి వద్దే ఉంటూ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖాళీగా ఉండలేక సమీప పట్టణాల్లో ఐదారు వేల వేతనంతో ఏ చిరుద్యోగంలోనే చేరిపోతున్నారు.
 
 పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం: అజయ్‌జైన్, కమిషనర్, సాంకేతిక విద్య
 ‘‘విద్యా బోధనలో నాణ్యత లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (టెక్విప్)లో చేరిన కొన్ని కళాశాలలు నాణ్యమైన విద్య అందిస్తూ ప్లేస్‌మెంట్లు కూడా చూపాయి. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరం? మనం ఏం శిక్షణ ఇవ్వాలి? అన్న అంశాలను నిత్యం సమీక్షించుకునేందుకు పారిశ్రామిక అనుసంధానం ఉండాలి. నాణ్యతకు అర్థం ఇదే. ప్రతిష్టాత్మక సంస్థలన్నీ చేసేది ఇదే. థియరీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రాక్టికల్‌గా పెంపొందించాలంటే పారిశ్రామిక అనుసంధానమే శరణ్యం’’
 
 దేశీయంగా ప్రాజెక్టులు పెరగాలి: ఎన్.ఎల్.ఎన్.రెడ్డి, ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్, సీబీఐటీ
 ‘‘ఇప్పటికీ మన దేశంలోని ఐటీ కంపెనీలన్నీ అమెరికా ప్రాజెక్టులపైనే ఆధారపడుతున్నాయి. మనదేశం ఇ-గవర్నెన్స్ అమలుచేస్తున్నప్పటికీ ఇది చాలా స్వల్పం. దీన్ని విస్తృతపరిస్తే దేశీయ ప్రాజెక్టులతో ఐటీ రంగం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయి’’
 
 ఆ కాలేజీలపై ఉక్కుపాదం మోపాలి: డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ నిపుణులు
 ‘‘కాలేజీల్లో కనీస ప్రమాణాల నియంత్ర ణ కరువైంది. కొన్ని యాజమాన్యాలు ప్రమాణాలు పెంచకుండా సీట్లు పెంచుకోవడం ఎలా? వాటిని నింపుకోవడం ఎలా? అటెండెన్స్ లేని వారికి అటెండెన్స్ వేసి డబ్బులు సంపాదించడం ఎలా? వంటి చర్యలకు దిగజారాయి. ఇప్పటికైనా ప్రమాణాలు పాటించని కళాశాలలపై ఉక్కుపాదం మోపాలి. టాస్క్‌ఫోర్స్ కమిటీలు చేసిన తనిఖీ నివేదికలను బయటపెట్టాలి’’
 
 బీటెక్ చదువు.. కానిస్టేబుల్ పోస్టు
 బీటెక్ పట్టాలు చేతిలో ఉన్నా ఎందరో అభ్యర్థులు కిందిస్థాయి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇక సర్కారీ కొలువైతే అదే పదివేలు అనుకుంటున్నారు. ఎంత చిన్న పోస్టు అయినా అందులో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం శిక్షణలో ఉన్న 12 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 10 శాతం మంది.. అంటే 1,200 మంది బీటెక్ అభ్యర్థులే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బీటెక్ చదివినా ఇంటర్మీడియెట్ స్థాయితో భర్తీ అయ్యే పోస్టుల్లో చేరిపోయారు. వీరే కాదు.. ఈ 12 వేల మందిలో దాదాపు 6 వేల మంది పీజీ పట్టభద్రులు ఉండడం గమనార్హం. తమ వద్దకు వచ్చిన అభ్యర్థుల్లో తెలుగు కూడా సరిగ్గా రానివారు పెద్ద సంఖ్యలో ఉన్నారని పోలీస్ నియామకాలు చూసే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బీటెక్  సర్టిఫికెట్ పట్టుకొని బయటకు వస్తున్న వారిలో కేవలం 10 శాతం మందికే ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యం ఉంటోందని ఇటీవల నాస్కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. బయటకు వస్తున్న చాలా మందిలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని తెలిపింది.
>
మరిన్ని వార్తలు