అదరగొట్టిన దిగ్గజాలు..

28 Oct, 2016 20:10 IST|Sakshi
అదరగొట్టిన దిగ్గజాలు..
ఆటో మోటార్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ దిగ్గజాలు నేడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ దిగ్గజం బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఆర్థికసంవత్సర సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా తన నికర లాభాలను 66 శాతం పెంచుకుని రూ.234 కోట్లగా నమోదుచేసింది. అగ్రికల్చర్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్లోని తమ సహకారమే లాభాల బాటకు తోడ్పడిందని పేర్కొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, కరువు వంటివాటితో బాధపడుతున్న రైతులకు ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.159 కోట్ల నుంచి రూ.737 కోట్లకు పెంచుకోగలిగామని కంపెనీ తెలిపింది.  
 
జంప్ చేసిన ఐషర్ మోటార్స్ 
 
వాణిజ్య వాహనాల ఉత్పత్తి సంస్థ ఐషర్ మోటార్స్ లాభాల్లో జంప్ చేసింది. సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభాలు 45.19శాతం ఎగిసి, రూ.413.16కోట్లగా రికార్డు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.284.56కోట్లగా ఉన్నాయి. క్వార్టర్ రివ్యూ సందర్భంగా కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్కమ్ రూ.1,981.01కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. గతేడాది కంటే కంపెనీ 34.9 శాతం వృద్ధి నమోదుచేశామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. నిర్వహణల నుంచి ఈ త్రైమాసికంలో అత్యధిక ఆదాయాల్లో ఆర్జించామని పేర్కొన్నారు. తమ టూవీలర్ విభాగం రాయల్ ఫీల్డ్ 30.8 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు.   
 
నెస్లే రెండింతలు జంప్
 
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం నెస్లే ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభాలూ రెండింతలు జంప్ అయ్యాయి. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.269.39 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.124.20 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జించింది. నికర విక్రయాలు 35.13 శాతం ఎగిసి, రూ.2,346.18కోట్లగా రికార్డైనట్టు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. కంపెనీ లాంచ్ చేసిన 25 పైగా కొత్త ప్రొడక్ట్లతో లాభాల వృద్ధికి బాటలు వేశామని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ తెలిపారు. మ్యాగీ ఉత్పత్తులతో మళ్లీ ఇన్స్టాంట్ న్యూడిల్స్ కేటగిరీలో పూర్తి ఆధిపత్య స్థానానికి వచ్చేశామని పేర్కొన్నారు.   
 
నష్టాల్లోంచి లాభాలోకి వచ్చిన ఐడీఎఫ్సీ
 
దేశీయ లీడింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐడీఎఫ్సీ నష్టాల్లోంచి లాభాల్లోకి పయనించింది. శుక్రవారం వెలువరించిన ఫలితాల్లో కంపెనీ రూ.281.79 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాలను ఆర్జించినట్టు పేర్కొంది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,468.83కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. గ్రూప్ మొత్తం ఆదాయం ఈ క్వార్టర్లో రూ.2,704.13 కోట్లగా ఉన్నట్టు బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. 
 
బజాజ్ ఆటో@7 శాతం
 
ఇటు టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో సైతం రెండో క్వార్టర్లో 6.7 శాతం వృద్ధిని నమోదుచేసి రూ.1,122 కోట్ల లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. ఇతరాత్ర ఆదాయాలు లాభాలకు వెన్నుదన్నుగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ క్వార్టర్లో రెవెన్యూలు స్వల్పంగా 0.4 శాతం మాత్రమే పెరిగి రూ.6,432కోట్లగా నమోదయ్యాయి. నెమ్మదించిన సేల్స్ వాల్యుమ్ గ్రోత్తో రెవెన్యూలు స్వల్పంగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 10.3 లక్షల యూనిట్ల విక్రయాలు జరుపగా.. గతేడాది కంపెనీ 10.56 లక్షల యూనిట్లను అమ్మింది. నైజీరియా, ఈజిప్ట్ వంటి ఎగుమతుల మార్కెట్లలో విక్రయాలు పడిపోయినట్టు బజాజ్ ఆటో తెలిపింది.   
మరిన్ని వార్తలు