వెదురు బుట్ట.. దాహం తీరుస్తుంది!

4 Apr, 2014 02:02 IST|Sakshi
వెదురు బుట్ట.. దాహం తీరుస్తుంది!

 ప్రపంచవ్యాప్తంగా గుక్కెడు నీళ్లు అందనివారు.. 76 కోట్ల మంది! కలుషిత  నీరు తాగుతూ రోజూ 1,400 మంది పసిపిల్లలు చనిపోతున్నారు! ఈ ఆధునిక యుగంలోనూ ఇంత దారుణమా? హైటెక్ పద్ధతులతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు కదా? అనుకుంటున్నారా? అయితే అందుకు హైటెక్ పద్ధతులూ అవసరం లేదు.. ఓ వెదురు బుట్ట.. కొంచెం ప్లాస్టిక్ ముక్క ఉంటే చాలు.. రోజూ కనీసం వంద లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించవచ్చంటున్నారు డిజైనర్ అర్టూరూ విట్టోరి! 30 అడుగుల ఎత్తుతో ఓ వెదురు బుట్టను నిర్మించి దాని లోపలి భాగంలో నైలాన్, పాలీప్రొపెలీన్ ప్లాస్టిక్ తెరను ఏర్పాటు చేస్తే చాలు.. గాలిలో ఉండే తేమనే నీటిబొట్లుగా మారి కింద ఉన్న పాత్రలోకి చేరతాయని ఆయ న చెబుతున్నారు.
 
 చల్లటి నీళ్లు ఉన్న గాజు గ్లాస్‌కు  బయటిభాగంలో నీటి బిందువులు ఏర్పడినట్లు అన్నమాట. ‘వర్కా వాటర్ టవర్స్’ అని పేరు పెట్టిన ఈ నీటి సేకరణ బుట్టలను ఆఫ్రికాలోని వర్కా వృక్షాల స్ఫూర్తితో తాను డిజైన్ చేశానని విట్టోరి తెలిపారు.
 
 ఇథియోపియా వంటి దేశాల్లో మంచినీటి కోసం నానా కష్టాలూ పడుతున్నారని, మహిళలు మైళ్లకొద్దీ నడిచి వెళ్లినా గుక్కెడు నీరు దొరకని పరిస్థితులున్నాయని విట్టోరి ఆవేదనతో చెబుతారు. ఈ ప్రాంతాల్లో నేల మొత్తం రాతిపొరలతో ఉండటం, భూగర్భ జలాలు 1,500 అడుగుల లోతులో ఉండటం వల్ల బోరుబావులు వేయడమూ కష్టమేనని,  అందుకే తాను వర్కా వాటర్ టవర్స్‌ను రూపొందించానని వివరించారు. ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.30 వేల వరకూ ఖర్చవుతుందని, వచ్చే ఏడాదే ఇథియోపియాలో రెండు వర్కా టవర్లు ఏర్పాటు చేస్తానని అంటున్నారు విట్టోరి!
 

మరిన్ని వార్తలు