ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సెబీ కొరడా

27 May, 2016 00:15 IST|Sakshi
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సెబీ కొరడా

స్టాక్ మార్కెట్ నుంచి నిధుల సమీకరణపై నిషేధం..
లిస్టెడ్ కంపెనీల్లో బోర్డు పదవులకూ చెక్...
సవరించిన నిబంధనలను నోటిఫై చేసిన సెబీ

 
న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో బ్యాంకింగ్ రంగం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా కఠిన చర్యలను చేపట్టింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఎవరైనా క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఇకపై నిధులను సమీకరించకుండా నిషేధం విధించింది. అదేవిధంగా సంబంధిత వ్యక్తులు లిస్టెడ్ కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో కూడా ఎలాంటి పదవులూ చేపట్టడానికి అవకాశం లేనట్టే. ఈ మేరకు సవరించిన నిబంధనలను సెబీ నోటిఫై చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగవేసి.. దేశం విడిచి పరారైన నేపథ్యంలో సెబీ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పలు బ్యాంకులు ఇప్పటికే మాల్యాను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాయి కూడా. మరోపక్క, డియాజియోతో ఒప్పందం ప్రకారం యునెటైడ్ స్పిరిట్స్ కంపెనీ చైర్మన్, డెరైక్టర్ పదవి నుంచి తప్పుకున్న మాల్యా.. ఇంకా పలు ఇతర కంపెనీల డెరైక్టర్ల బోర్డుల్లో మాత్రం కొనసాగుతున్నారు. సెబీ సవరించిన నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ఇలాంటి కంపెనీలకు మార్కెట్ నుంచి పూర్తిగా నిధుల సమీకరణ చేయకుండా నిషేధం విధించడం వల్ల ఇతర వాటాదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

 నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిన కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజి సంస్థలు వంటి మార్కెట్ ఆధారిత సంస్థలను ఏర్పాటు చేయడాలికి వీల్లేదు. అదేవిధంగా ఇతర లిస్టెడ్ కంపెనీలను టేకోవర్ చేయడం కూడా కుదరదు.
డిఫాల్ట్ అయిన కంపెనీ లేదా సంబంధిత ప్రమోటర్లు, డెరైక్టర్లు ఎవరూ పబ్లిక్ ఇష్యూల ద్వారా షేర్ల జారీ, డెట్ సెక్యూరిటీలు, నాన్-కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టకూడదు.

ప్రస్తుత వాటాదారుల నుంచి(ప్రమోటర్లు సహా) రైట్స్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ రూపంలో ఇటువంటి కంపెనీలు నిధులను సమీకరిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే, తమను ఏ బ్యాంకు విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించిందో.. ఎంత బకాయి చెల్లించాల్సి ఉందో ఇతరత్రా వివరాన్నింటినీ సంబంధిత కంపెనీ తెలియజేయాల్సి ఉంటుంది.

►  ప్రమోటర్లు లేదా కీలకమైన యాజమాన్య పదవుల్లో ఉన్న వ్యక్తులు లేదా డెరైక్టర్లు విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ఉన్న కంపెనీల కొత్త రిజిస్ట్రేషన్లకు సెబీ అనుమతించదు.
 

మరిన్ని వార్తలు