‘ఏటీఎం’ నిందితుణ్ణి పట్టిస్తే 3 లక్షలు

28 Nov, 2013 15:56 IST|Sakshi

అనంతపురం, న్యూస్‌లైన్: కర్ణాటక రాజ దాని బెంగళూరులోని ఏటీఎం కేంద్రంలో సుమారు పది రోజుల కిందట పట్టపగలే ఓ మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన అగంతకుడి ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితుణ్ణి పట్టిచ్చిన వారికి ప్రకటించిన నజరానాను రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచారు. ఇప్పటికే కర్ణాటక ప్రకటించిన నజరానా రూ. లక్షతోపాటు అనంతపురం పోలీసుల తరఫున మరో రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని చిత్తూరు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ బుధవారం రాత్రి అనంతపురంలో ప్రకటించారు.

అదేసమయంలో కర్ణాటక పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేసినట్టు చెప్పారు. ఇదిలావుంటే, సదరు నిందితుడే ధర్మవరంలో ప్రమీలమ్మ అనే మహిళను హత్య చేసి ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లాడని నిర్ధారణకు రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నిందితుణ్ణి పోలివున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు.

మరిన్ని వార్తలు