‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం

21 Nov, 2013 08:22 IST|Sakshi
‘బెంగళూరు ఏటీఎం’ బాధితురాలికి పక్షవాతం

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో దాడికి గురైన కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌కు కుడివైపు పక్షవాతం వచ్చింది. మంగళవారం ఉదయం డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన ఆమెపై ఒక ఆగంతకుడు వేట కత్తితో దాడి చేయగా తలపై తీవ్రంగా గాయమైన విషయం తెలిసిందే. దాడి అనంతరం షట్టర్ మూసి వెళ్లి పోవడం వల్ల మూడు గంటలు గడిచే వరకూ ఎవరూ గుర్తించక పోవడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం జ్యోతి మాట్లాడగలుగుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ ఎన్‌కే వెంకటరమణ బుధవారం విలేకరులకు తెలిపారు. దుండగుడు తలపై బలంగా నరకడంతో చిన్న ఎముక ముక్క విరిగి మెదడులోకి చొచ్చుకుపోయిందని, దానిని తొలగించామని డాక్టరు తెలిపారు.
 
దీనివల్ల ఆమె శరీరంలో కుడి వైపు చచ్చుబడిపోయిందని ఆయన చెప్పారు. దాడిలో ఆమె ముక్కు తెగిందని, ముఖంపై పలుచోట్ల గాయాలయ్యాయని వాటినిప్లాస్టిక్ సర్జరీతో సరిచేశామని చెప్పారు. దాడి జరిగిన రోజు రాత్రి ఆమెకు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా, దుండగుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ నాయకత్వంలో ఎనిమిది బృందాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టాయి. అయితే ఆగంతకుడు కన్నడం మాట్లాడాడని, డబ్బు తీసివ్వు, డబ్బు తీసివ్వు అంటూ గదమాయించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
 
 ఏటీఎంల మూత
 నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను మూయించి వేస్తామని హోం మంత్రి కేజే జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను నియమించాల్సిందిగా బ్యాంకులకు సూచించారు. ప్రత్యేక పోలీసు చట్టాన్ని రూపొందించి, దాని పరిధిలోకి బ్యాంకులను తీసుకు వచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇకమీదట పోలీసుల అనుమతి లేనిదే ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని బ్యాంకులకు సూచించనున్నట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు