భారత్‌ – బంగ్లా భాయి భాయి!

26 Mar, 2017 23:13 IST|Sakshi
భారత్‌ – బంగ్లా భాయి భాయి!
- నమ్మదగిన దేశంగా బంగ్లాదేశ్‌ను అభివర్ణించిన ప్రధాని
- ‘మన్‌కీ బాత్‌’ వేదికగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు
- భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల త్యాగాలను స్మరించిన మోదీ
 
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్‌కీ బాత్‌లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలతో రేడియో ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి బంగ్లాదేశ్‌ ప్రజలు చరిత్రాత్మక విజయం సాధించారని పేర్కొన్నారు. 
 
బంగ్లాదేశ్‌తో భారత్‌ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుందన్నారు. భారత్‌కు బంగ్లాదేశ్‌ నమ్మదగిన దేశమని స్పష్టం చేశారు. దేశం కోసం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు మార్చి 23న ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు. వీరి త్యాగాలను వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ ముగ్గురి ముఖాల్లో భయం లేదు.. దేశం కోసం ప్రాణాలు విడుస్తున్నామనే ఆనందమే ఉన్నదని తెలిపారు. 
 
క్యాష్‌లెస్‌.. ఫుల్‌ జోష్‌
నగదు రహిత లావాదేవీలపై భీమ్‌ యాప్‌ ద్వారా అవగాహన కల్పించామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల్లోనే భీమ్‌యాప్‌ను 18 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని గుర్తుచేశారు. నగదురహిత లావాదేవీలు ఉద్యమంలా జరుగుతున్నాయన్నారు. నగదురహిత లావాదేవీలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, పాఠశాలలు, దుకాణాలు, సంస్థలుసహా దాదాపు అన్నిరంగాల్లో నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయని వెల్లడించారు. అవినీతి, నల్లధనాన్ని ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. 
 
పేదల కడుపు నింపడమే కర్తవ్యం..
అయితే కొంతమంది పెద్దలు పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపాలన్నదే మా కర్తవ్యమని ఉద్ఘాటించారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించిన అంశమని చెప్పారు. స్వచ్ఛ భారత్‌ ఉద్యమంతో ప్రతి ఒక్కరిలో స్వచ్ఛత అలవాటుగా మారుతుందని తెలిపారు.
 
మనం అదృష్టవంతులం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ (మనసులో మాట) కార్యక్రమంలో కొత్త సబ్జెక్టుపై చర్చించారు. ‘మానసిక ఒత్తిడి’ అనే అంశంపై మాట్లాడారు. ‘‘మనం డిప్రెషన్‌ గురించి బాహాటంగా చర్చించడానికి భయపడతాం. మానసిక ఒత్తిడికి గురవుతూ కుంగిపోవడం మంచిది కాదు. వ్యక్తీకరణ అనేది ఎప్పటికీ మంచిది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లు తమ బాధలు ఇతరులతో పంచుకుంటే అంది ఎంతో ఉపశమనం కల్గిస్తుంది. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినం జరుగనుంది. భారత్‌లో 36శాతం మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 322 మిలియన్ల మంది జనం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు వివరించింది. అయితే భారత్‌ లో ఉమ్మడి కుటంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉండటం వల్ల ఒకరి కష్టసుఖాలు మరొకరితో చెప్పుకోవడానికి వీలుంది. ఈ విషయంలో మనం అదృష్టవంతులమ’ని మోదీ అన్నారు. అయితే దూర ప్రాంతాల్లో ఉంటున్న యువత కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొన్నిసార్లు డిప్రెషన్‌ కు గురవుతారని...వారి ఇబ్బందులు చెప్పుకోవడానికి తన వాళ్లు దగ్గరుండాలని భావిస్తారని ఆయన గుర్తు చేశారు.
>
మరిన్ని వార్తలు