గ్యాస్‌కు ఎక్కువ రేటు కావాలంటే...బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే

19 Nov, 2013 00:47 IST|Sakshi
గ్యాస్‌కు ఎక్కువ రేటు కావాలంటే...బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కి అధిక ధర పొందాలనుకున్న పక్షంలో బ్యాంక్ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చమురు శాఖ స్పష్టం చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి మూడు నెలలకోసారి 13.5 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని సూచించింది. ఎక్కువ రేటు పొందే ఉద్దేశంతో.. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ (ఆర్‌ఐఎల్) కావాలనే తగ్గించిందని తేలిన పక్షంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం తన ఖజానాలో జమచేసుకుంటుందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే వడ్డీని కూడా రాబడుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలించినట్లు ఆయన చెప్పారు. గ్యాస్ ఉత్పత్తి వివాదం తేలేదాకా ఏప్రిల్ 1 నుంచి కస్టమర్ల నుంచి కొత్త రేటు వసూలు చేసి, ఆర్‌ఐఎల్‌కి పాత ధరనే ఇవ్వడం..రెండు రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎస్క్రో అకౌంట్లో ఉంచడం మొదటి ప్రతిపాదన. అయితే, ఉత్పత్తి పంపక ఒప్పందం ప్రకారం ఎస్క్రో ఖాతా సాధ్యపడదు. దీంతో, మరో ప్రత్యామ్నాయం అయిన బ్యాంక్ గ్యారంటీ అంశాన్ని కేంద్రం ప్రతిపాదించింది.
 
 ప్రస్తుతం ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేసే గ్యాస్‌కు యూనిట్‌కి 4.2 డాలర్లు లభిస్తోంది. దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి 8.4 డాలర్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, అధిక ధర పొందే ఉద్దేశంతో కావాలని గ్యాస్ ఉత్పత్తిని తగ్గించే సిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఐఎల్‌కి మాత్రం కొత్త రేటును వర్తింప చేయరాదని కేంద్రం నిర్ణయించింది. వాస్తవాలు తేలే వరకూ కొత్త రేటుకు అనుమతించకూడదని భావిం చింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఆర్‌ఐఎల్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 61.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 10 ఎంసీఎండీకన్నా తక్కువకి పడిపోయింది. పెట్టుబడి ప్రణాళికల అంచనాల కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. అయితే , గ్యాస్‌ని కృత్రిమంగా తొక్కిపెట్టి ఉంచడం సాధ్యపడదని, ఉత్పత్తి పడిపోవడానికి భౌగోళిక పరిస్థితులే కారణమని ఆర్‌ఐఎల్ చెబుతోంది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా