బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ సంచలన వ్యాఖ్యలు

15 Nov, 2016 13:59 IST|Sakshi
బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ సంచలన వ్యాఖ్యలు

ముంబై:   ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ మండిపడుతోంది. నూతనంగా   ప్రవేశపెట్టిన నోట్లను తగినంతగా అందుబాటులో ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని  బ్యాంక్ ఎంప్లాయీస్  ఫెడరేషన్  ఆఫ్ ఇండియా (బీఎఫ్ఎఫ్ఐ)  కోరింది.  బీఎఫ్ఎఫ్ఐ 12 వ రాష్ట్ర సదస్సు  సందర్భంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు టి నరేంద్రన్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  

కరెన్సీ రద్దుతో  నకిలీ కరెన్సీ, నల్లధనం వెలికి వస్తుందన్న ప్రభుత్వ వాదనను   కొట్టిపారేసిన ఆయన   ఈ చర్య పేదల కష్టాలను  మరింత పెంచిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన  పరిస్థితులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు.  కరెన్సీ లభ్యతను మెరుగుపర్చి   ప్రజలకు మరింత  భరోసా  ఇవ్వాలని కోరారు.

కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంలో, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలోపంతో  కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ వైఫల్యం  బహిర్గతమైందన్నారు నరేంద్రన్.  ప్రయివేటీకరణ, బడాబాబులకు వత్తాసు పలికే చర్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. .ప్రయివేట్ కాంట్రాక్టర్ ఏజెన్సీల కారణంగా  ప్రజలు  ఏటీఎంల నుంచి నగదును పొందలేకపోతున్నారని మండిపడ్డారు . దీంతో దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి  నెలకొందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రత్యామ్నాయ  చర్యలు, కరెన్సీలు లభ్యతపై భరోసా లేకుండా తీసుకున్న  నిర్ణయంతో  ప్రజల అవసరాలను తీర్చలేని పరిస్థితికి బ్యాంకులు నెట్టబడ్డాయనీ, దీంతో  ప్రజలకు, బ్యాంకు ఉద్యోగులకు  మధ్య  లేనిపోని  విభేదాలు తలెత్తుతున్నాయని నరేంద్రన్   వ్యాఖ్యానించారు.   కరెన్సీ బ్యాన్ తదనంతర పరిణమాలపై సరైన హోంవర్క్ లేకుండానే ఆర్థిక వ్యవస్థలో 6 శాతా  వాటా ఉన్న పెద్ద  కరెన్సీ నోట్ల రద్దును   ప్రకటించారని  ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు