బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు

21 Dec, 2016 09:12 IST|Sakshi
బాంబు పేల్చిన బ్యాంకు ఉద్యోగులు

న్యూఢిల్లీ: ఒక వైపు దేశంలో డీమానిటైజేషన్  కష్టాలు కొనసాగుతుండగానే బ్యాంకు ఉద్యోగులు బాంబు పేల్చారు.  పెద్ద నోట్ల రద్దు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్  సహా వివిధ బ్యాంకులు, వారి  ఉద్యోగులు  ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.  డిసెంబర్ 28న భారీ ఎత్తున ఆందోళన  నిర్వహించనున్నాయి. అనంతరం డిసెంబర్ 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖను అందించనున్నామని యూనియన్లు ప్రకటించాయి.  ఇదే అంశమై 2017 జనవరి 2, 3 తేదీల్లో  కూడా  ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపాయి.

ఎంప్లాయీస్ అసోసియేషన్,  ప్రధాన కార్యదర్శి సి.హెచ్ వెంకటాచలం, బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్  ఎస్ నాగార్జున  ఈ మేరకు ఒక ప్రకటన జారీచేశారు.  తమ సంస్థల పిలుపు మేరకు, ఇప్పటికే తమ యూనిట్లు అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు కార్యక్రమం  చేపట్టి, స్తానిక ఆర్బీఐ అధికారులకు  మెమోరాండం అందించినట్టు తెలిపారు.

తాము సరిపడా నగదు సరఫరా చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ను కోరామనీ, కానీ  ఆర్ బీఐ విఫలమైందని ఆరోపించారు.  నగదు  అందుబాటులో లేనపుడు ఆయా  కార్యాలయల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. భారీ ఎత్తున కొత్త నోట్లు పట్టుబడ్డ  కొంతమంది వ్యక్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు  డిమాండ్ చేశారు. దీంతోపాటు డీమానిటైజేషన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన  బ్యాంకు సిబ్బంది  కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం  దాదాపు 9 లక్షల బ్యాంక్ ఉద్యోగుల్లో  రెండు సంఘాలు  5.50 లక్షల మంది  సభ్యులుగా ఉన్నారు.   రద్దయిన పాత నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్30 తో ముగియనున్న సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు