బరాక్ ఒబామా హీరో ఎవరు?

19 Jul, 2014 20:30 IST|Sakshi
బరాక్ ఒబామా హీరో ఎవరు?

 వాషింగ్టంన్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా తనకు వ్యక్తిగత హీరో అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. నెల్సన్ మండేలా, ఈ భూమిపై జన్మించిన అత్యంత ప్రభావశీలి, సాహసి అయిన విశిష్టవ్యక్తి అని, న్యాయం, సమానత్వం కోసం కషిచేసిన పోరాటయోధుడని అని ఒబామా ప్రశంసించారు. తనకేకాక, మరెంతో మందికి వ్యక్తిగత హీరోగా మండేలా నిలిచారన్నారు. మండేలా జయంతి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన మండేలా అంతర్జాతీయ దినోత్సవంలో ఒబామా పాల్గొన్నారు.

మండేలా గత ఏడాది కన్నుమూసిన తర్వాత తొలిసారిగా ఆయన జయంతిని జరుపుకుంటున్నామని, మన జీవితాలపై ఆయన వేసిన ముద్ర మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒబామా అన్నారు. ప్రజలు మడీబా అని ఆప్యాయంగా పిలుచుకునే మండేలా1918 జూలై 18న జన్మించారు. 2013 డిసెంబర్ 5న తన 95వయేట కన్నుమూశారు. తన జన్మదినం సెలవు దినం కాకూడదని, సేవకు అంకితమయ్యే రోజుగా ఉండాలని మడీబా కోరుకున్నట్టు ఒబామా చెప్పారు. ప్రజలు తమ సమయాన్ని, శక్తిని మానవాళి స్థితిగతులను మెరుగుపరచడానికి వినియోగించాలన్నదే మండేలా ఆశయమని ఒబామా చెప్పారు.  మడీబా వంటి మరో వ్యక్తిని మనం మళ్లీ చూడలేకపోవచ్చని, ప్రతిరోజూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన్ను తగినరీతిలో గౌరవించుకోవచ్చని ఒబామా ప్రజలకు సూచించారు.

>
మరిన్ని వార్తలు