సాకర్ స్టార్ మెస్సీకి జైలు శిక్ష

6 Jul, 2016 16:49 IST|Sakshi
సాకర్ స్టార్ మెస్సీకి జైలు శిక్ష

మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ లియోనెల్ మెస్సీకి స్పానిష్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రీమియర్ లీగ్స్ లో బార్సిలోనా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మెస్సీ.. ఆదాయపన్ను ఎగవేశారనే నేరం రుజువు కావడంతో స్పెయిన్ కోర్టు అతనికి 21 నెలల జైలు శిక్ష విధించింది. శిక్షతోపాటు రెండు మిలియన్ యూరోల జరిమానాను కూడా విధిస్తున్నట్లు కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెస్సీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి జార్జ్ మెస్సీకి కూడా 21 నెలల జైలు శిక్షతోపాటు 1.5 మిలియన్ యూరోల జరిమాన విధించింది.

తీర్పు వెలువడగానే మెస్సీ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మెస్సీ, అతని తండ్రి కోర్టుకు మొరపెట్టుకున్నారు. దీంతో న్యాయమూర్తి.. తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లొచ్చని ఊరడించారు. ప్రపంచంలో భారీగా ఆదాయాన్ని గడిస్తోన్న ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. ప్రీమియర్ లీగ్స్ ద్వారా వేలకోట్ల డాలర్లు పోగేసుకుంటోన్న మెస్సీ.. ఆ మేరకు పన్ను చెల్లించడం లేదంటూ స్పెయిన్ ఐటీ శాఖ మూడు కేసులను నమోదు చేసింది. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు చెప్పింది.


ఏళ్లుగా అర్జెంటీనా జట్టు సారధిగా, ఫార్వర్డ్ ఆటగాడిగా కొనసాగిన మెస్సీ గత నెలలో జాతీయజట్టు నుంచి తప్పకున్నాడు. కోపా అమెరికా కప్ ఫైనల్స్ లో చిలీ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా జట్టును అభిమానులు మొదట తిట్టుకున్నా.. మెస్సీ రాజీనామా ప్రకటనతో కాస్త చల్లబడ్డారు. గత ఫుల్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు