‘బయ్యారం’ ఖనిజాన్వేషణ ప్రైవేటుకు

6 Nov, 2015 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని ఖనిజ నిల్వలను గతంలోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)కు అప్పగించా రు. ఈ నేపథ్యంలో ఖనిజాన్వేషణకు ప్రైవేటు ఏజెన్సీలను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యతను టీఎస్‌ఎండీసీకి అప్పగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ద్వారా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు సెయిల్ ప్రతినిధులు ఖమ్మంలో పర్యటించి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కనీసం 200 మిలియన్ టన్నుల ముడి సరుకు అవసరమని తేల్చారు. రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక ఇచ్చింది.

ఈ నివేదిక శాస్త్రీయంగా లేనందున 200 మిలియన్ టన్నుల ముడి ఇనుముపై పూర్తి నివేదిక ఇవ్వాలని సెయిల్ సూచించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఐతో సమన్వయం చేసుకుంటూ ముడి ఇనుము లభ్యతపై నివేదిక సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం గత ఫిబ్రవరిలో టీఎస్‌ఎండీసీకి అప్పగించింది.
 
కొలిక్కిరాని ఖనిజాన్వేషణ
ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని బయ్యారంలో 100 చదరపు కి.మీ. పరిధిలో జీఎస్‌ఐ, గనులు, భూగర్భ వనరుల శాఖ సంయుక్త సర్వే నిర్వహించింది. లభ్యత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న 60 చ.కి.మీ. పరిధిలో 14 చోట్ల డ్రిల్లింగ్ చేసి ఖనిజం లభ్యతపై అంచనాకు రావాలి. డ్రిల్లింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో మూడుచోట్ల ఖనిజాన్వేషణ బాధ్యతను సింగరేణికి అప్పగించారు.

మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల డ్రిల్లింగ్ చేయాలని జీఎస్‌ఐ తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే బయ్యారంలో జీఎస్‌ఐ, సింగరేణి డ్రిల్లింగ్‌ను సకాలంలో పూర్తి చేయలేనందున కొత్తగా ప్రతిపాదించిన 12 పాయింట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇనుము లభ్యతపై స్పష్టత వస్తుందని టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు