‘బీఫ్’ వినియోగం పెరుగుతోంది!

6 Nov, 2015 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బీఫ్ వినియోగం పెరుగుతోంది. గోవధ నిషేధంపై వివాదం రేగుతున్న సమయంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా బీఫ్ వినియోగం పెరుగుతున్నట్లు తేలింది. 2010- 2012 మధ్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది 3.9% నుంచి 4 శాతానికి.. పట్టణ ప్రాంతాల్లో 4.3% నుంచి 5 శాతానికి పెరిగిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ పేర్కొంది. దేశంలో దాదాపు 8 కోట్లమంది బీఫ్‌ను ఆహారంగా తీసుకుంటారని తెలిపింది.

ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బీఫ్‌తో పాటు పాలు, గుడ్లు, చికెన్.. తదితర ఆహార పదార్ధాల వినియోగం పెరుగుతోంది. వీటి స్థాయిలో పప్పు దినుసుల వినియోగం పెరగకపోవడం విశేషం. అధిక ధరల కారణంగా చేపలు, రొయ్యలు, మటన్(గొర్రె, మేక మాంసం) తదితరాల వినియోగం క్రమంగా తగ్గుతోంది.

చేపలు, రొయ్యల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 30.7% నుంచి 26.5 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 27.1% నుంచి 21 శాతానికి తగ్గింది. 2004 తరువాతే  ఎన్‌ఎస్‌ఎస్‌ఓ మటన్, బీఫ్‌ల వినియోగాన్ని వేరువేరుగా లెక్కిస్తోంది.

>
మరిన్ని వార్తలు