'గంగూలీకి తప్ప.. నీకు సరిపోదు'

18 Aug, 2015 20:54 IST|Sakshi
మంగళవారం నాటి బంద్ కార్యక్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా చొక్కావిప్పిమరీ సవాల్ విసురుతున్న బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి

కోల్కతా: పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ ఆదిర్ రంజన్ చౌదురి రోడ్డుపై తన చొక్కా విప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. చొక్క విప్పడం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి మాత్రమే సరిపోతుందని, ఇతరులకు సరిపోదని అన్నారు. విషయమేంటంటే..

పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ తృణమాల్ కాంగ్రెస్ దౌర్జన్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బంద్కు పిలుపునిచ్చింది. ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్లో చౌదురి తన చొక్కా విప్పి, కాల్చండంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. కాగా కాంగ్రెస్ బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలావుండగా 2002లో లండన్ లార్డ్స్ స్టేడియంలో నాట్వెస్ట్ ట్రోఫీలో విజయానంతరం అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ చొక్కా విప్పి విజయసూచికగా గాల్లో తిప్పిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. మమత ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ చీఫ్ చర్యపై పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరును మమత విమర్శించారు.
 

మరిన్ని వార్తలు